Idream media
Idream media
అసోం ఏకైక మహిళ ముఖ్యమంత్రిగా పనిచేసిన సైదా అన్వారా తైమూర్ (84) గుండెపోటుతో ఆస్ట్రేలియాలో కన్నుమూశారు.గత నాలుగేళ్లుగా ఆమె ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్నారు.ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేశారు.
2018 లో అసోం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ లో తైమూర్ పేరు కనిపించకపోవడంతో వార్తలలో పతాక శీర్షికన నిలిచింది.అయితే ఆమె పేరు జాబితాలో లేకపోవడానికి తన కుటుంబ సభ్యులు దరఖాస్తు చెయ్యకపోవడం కారణమని ప్రకటించడంతో ఆ వివాదం సద్దుమణిగింది.
అసోం అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా 1972 లో అడుగుపెట్టిన తైమూర్ 1978, 1983 మరియు 1991 లలో కూడా విజయం సాధించారు. ఆమె 1980 డిసెంబర్ 6 నుండి 1981 జూన్ 30 వరకు కొద్ది నెలల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు.ఆ సమయంలో రాష్ట్రంలో విదేశీ వ్యతిరేక ఉద్యమం (1979-85) గరిష్ట స్థాయికి చేరుకుంది.ఆమె సీఎం కావడానికి ముందు పిడబ్ల్యుడి,విద్యాశాఖ మంత్రిగా కూడా తన సేవలు అందించారు. 1988, 2004 లలో రెండు సార్లు కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
2011 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ నిరాకరించగా తైమూర్ బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్)లో చేరారు.అనంతరం అనారోగ్య సమస్యలతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగిన ఆమె ఆస్ట్రేలియాలోని తన కొడుకు వద్ద ఉంటున్నారు.
ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ,అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,కాంగ్రెస్ నాయకులు తమ సంతాపాన్ని తెలిపారు. నాయకుల సంతాప ప్రకటనలలో తైమూర్ అసోం సీఎంగా, రాజ్యసభ సభ్యురాలిగా అసోం అభివృద్ధికి కృషి చేశారని ఆమె సేవలను కొనియాడారు.