iDreamPost
iDreamPost
ఓపెనర్లతో పాటు ప్రధాన బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో తొలి టెస్టు చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టు రెండవ టెస్టుకు ఒత్తిడితో సిద్ధమవుతుంది. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఒక వైపు బ్యాటింగ్ వైఫల్యం… మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు జోరు మీద ఉండడంతో ఇంగ్లాండ్‌కు ఇబ్బందికర పరిణామంగా మారింది. మరోవైపు తొలి టెస్టులో సునాయస విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.
యాషెస్ సిరీస్‌లో రెండవ టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 16 నుంచ 20 వరకు ఆడిలైడ్ ఒవెల్ మైదానంలో జరగనుంది. తొలి టెస్టు ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 147 పరుగులకు ఆల్‌ఔట్ అయింది. ఇక రెండవ ఇన్నింగ్‌లో 297 పరుగులు చేసినప్పటికీ మాలాన్ (82), రూట్ (89) స్కోర్‌లు తీసివేస్తే మిగిలిన 8 మంది బ్యాట్స్‌మెన్‌లు కలిసి చేసింది కేవలం 126 పరుగులు మాత్రమే. ఓపెనర్లు హమీద్, బర్న్స్‌లు రెండు ఇన్నింగ్స్‌లలోను విఫలమయ్యారు.
టీ20లో పింఛ్ హిట్టర్‌గా పేరొందిన బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 14 పరుగులు మాత్రమే చేశాడు. వీరితోపాటు పోప్, బట్లర్‌లు సైతం చాలా తక్కువ స్కోర్లకే విఫలం కావడంతో ఇంగ్లాండ్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు పటిష్టమైన బ్యాటింగ్ ఉండడంతో పాటు ఓపెనర్ డేవిడ్ వార్నర్, లుబుష్‌న్, హెడ్‌లు రాణించడం ఆస్ట్రేలియా మంచి జోష్ మీద ఉంది. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు ఈ మైదానం కలిసి వచ్చింది. ఈ మైదానంలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా వార్నర్‌కు రికార్డు ఉంది. పాకిస్తాన్ మీద 335 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మూడొంతులు ఫలితాలు:
148 ఏళ్ల చరిత్ర కలిగిన ఆడిలైడ్ ఒవెల్ మైదానంలో టెస్టులలో మూడొంతులు ఫలితాలు వచ్చాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా ఇక్కడ విజయం సాధించింది. ఇక్కడ 1884లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య తొలిటెస్టు మ్యాచ్ జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ 79 టెస్టులు జరిగాయి. వీటిలో 19 డ్రా కాగా, మిగిలిన 60 మ్యాచ్ ఫలితాలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య మొత్తం 32 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. వీటితో ఇంగ్లాండ్ జట్టు తొమ్మిది సార్లు గెలవగా, ఆస్ట్రేలియా జట్టు 18 సార్లు గెలిచింది. ఐదుసార్లు డ్రా అయ్యింది.
అడిలైడ్ ఒవెల్‌లో టెస్టు విశేషాలు ఇవే:
– అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డు సృష్టించాడు. మొత్తం 31 ఇన్నింగ్స్‌లో 1,743 పరుగులు చేశాడు. సగటు 56.22తో ఈ పరుగులు చేశాడు. తరువాత అలెన్ బోర్డర్ 1,415 (29 ఇన్నింగ్స్), మైకెల్ క్లార్క్ 1,414 (17 ఇన్నింగ్స్)లో చేశాడు.
– ఆస్ట్రేలియేతర ఆటగాళ్లలో బ్రియాన్ లారా 610 పరుగులు 8 ఇన్నింగ్స్‌లలో (76.25 సగటు) చేశాడు. తరువాత ఇంగ్లాండ్ క్రీడాకారుడు జాక్ హబ్స్ 601 (10 ఇన్నింగ్స్), వివి రిచర్డ్స్ 552 (10 ఇన్నింగ్స్)లలో అత్యధిక స్కోర్లు.
– ఆస్ట్రేలియా తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి డెవిడ్ వార్నర్. పాకిస్తాన్ మీద 2019లో 335 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తరువాత వరుసుగా డాన్ బ్రాడ్‌మెన్ 299 పరుగులు, రికీ పాంటింగ్ 242 పరుగులు, రాహూల్ ద్రావెడ్ 233 పరుగులు సాధించారు.
– అత్యధికంగా మైకిల్ క్లార్క్ ఏడు సెంచరీలు సాధించాడు. తరువాత పాంటింగ్ ఆరు, డేవిడ్ బూన్, అలెన్ బోర్డర్, డేవిడ్ వార్నర్‌లు నాలుగు చొప్పున సెంచరీలు చేశారు.
– ఆస్ట్రేలియా లెగ్ స్పినర్ షేన్ వార్నే ఈ మైదానంలో 56 వికెట్లు (26 ఇన్నింగ్స్‌లో) తీశాడు. తరువాత లయాన్ 51, మెగ్‌గ్రాత్ 46 వికెట్లు పడగొట్టారు.
– ఆస్ట్రేలియేతర క్రికెటర్లలో కపిల్‌దేవ్ ఈ మైదానంలో 19 వికెట్లు (ఆరు ఇన్నింగ్స్‌లో) తీయగా, తరువాత అండర్సన్, అశ్విన్, బ్రిగ్స్, గిబ్స్‌లు 16 చొప్పున వికెట్లు పడగొట్టారు. కపిల్‌దేవ్ 1985లో జరిగిన టెస్టులో 106 పరుగులకు ఎనిమిది వికెట్లు తీయడం విశేషం.
– ఒక ఇన్నింగ్‌లో అత్యధిక పరుగులు ఆస్ట్రేలియా జట్టు 674 పరుగులు భారత్‌పై 1948లో చేసింది. ఇండియా 36 పరుగులకు ఆల్‌ఔట్ కావడం అత్యల్ప స్కోరు.
– రికీ పాంటింగ్ (221), మైకెల్ క్లార్క్ (210) భారత్‌పై 2012లో నాల్గవ వికెట్‌కు 386 పరుగులు చేసి అత్యధిక భాగస్వామ్యం సాధించారు.
Also Read : కుప్పకూలిన ఇంగ్లాండ్.. తొలి టెస్ట్ నాలుగు రోజుల్లోనే ముగిసింది