iDreamPost
android-app
ios-app

Ashes Series, First Test – మొదటి టెస్ట్.. ఆధిక్యంలో ఆస్ట్రేలియా

  • Published Dec 09, 2021 | 4:00 PM Updated Updated Dec 09, 2021 | 4:00 PM
Ashes Series, First Test – మొదటి టెస్ట్.. ఆధిక్యంలో ఆస్ట్రేలియా

ఇంగ్లాండ్‌ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషిస్‌ సిరీస్‌ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించింది. స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసిస్‌ జట్టు గురువారం రెండవ రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు నష్టపోయి 343 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్‌ జట్టు కేవలం 147 పరుగులకు ఆల్‌ ఔట్‌ అయిన విషయం తెలిసిందే.

రెండవ రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ జోరుగా సాగింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ట్రావిస్‌ హెడ్‌ సెంచరీ సాధించాడు. 112 పరుగులు (12×4, 2×6)తో ఇంకా క్రీజ్‌లో ఉన్నాడు. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తృటిలో సెంచరీ చేజార్చుకున్నారు. వార్నర్‌ 94 పరుగులు (11×4, 2×6) సాధించగా, మరో బ్యాట్స్‌మెన్‌ లబూషేన్‌ 74(6×4, 2×6) చేయడంతో ఆస్ట్రేలియా రెండవ రోజు ఆటమీద పట్టు సాధించింది. ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్‌ పది పరుగులకే కోల్పయింది. ఓపెనర్‌ హ్యారిస్‌ కేవలం మూడు పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. తరువాత వార్నర్‌, లబూషేన్‌ భాగస్వామ్యంలో 156 పరుగులు సాధించారు. మూడవ వికెట్‌ 189 (స్మిత్‌ 12), నాల్గవ వికెట్‌ 195 (వార్నర్‌), అదే స్కోర్‌ వద్ద ఐదవ వికెట్‌ (గ్రీన్‌-0) వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాలలో పడిరది.

మరోసారి లాబూషేన్‌ జట్టుకు ఆపద్భాంధవునిగా నిలిచారు. ఆరవ వికెట్‌కు వికెట్‌ కీపర్‌ క్యారీ (12 పరుగులు)తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం, ఏడవ వికెట్‌కు కెప్టెన్‌ కుమిన్స్‌ (12 పరుగులు)తో కలిపి 70 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా మంచి గౌరవప్రదమైన స్కోర్‌ చేయడమే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది. మరో బ్యాట్స్‌మెన్‌ స్ట్రాక్‌ పది పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో రాబిన్స్‌న్‌ ఒక్కరే రాణించి మూడు వికెట్లు సాధించాడు.

కీలకమైన యాషిస్‌ సీరిస్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ జట్టు ప్రదర్శన అభిమానులను నీరుగార్చింది. ఆస్ట్రేలియా గబ్బాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి రోజే ఇంగ్లాండ్‌ జట్టు 147 పరుగులుకు ఆల్‌ ఔట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ జట్టులో వికెట్‌ కీపర్‌ బట్లర్‌ 39 అత్యధిక పరుగులు కావడం విశేషం. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ కుమిన్స్‌ బౌలింగ్‌లో రాణించి 38 పరుగులకు ఐదు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్‌ కుప్పకూలింది.

Also Read : రెండవ టెస్టులో భారీ విజయం.. సిరీస్‌ భారత్‌ వశం