iDreamPost
iDreamPost
నానాటికీ తీసికట్టు నాగంభట్లు… అన్నట్టుగా ఉంది ఇంగ్లాండ్ జట్టు ఆట తీరు. ఇప్పటికే రెండు టెస్టులు కోల్పోయి యాషెస్ సిరీస్‌లో వెనుకబడిన ఇంగ్లాండ్ జట్టు మూడవ టెస్టులో సైతం పేలవమైన బ్యాటింగ్‌తో తొలిరోజే కుప్పకూలింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడవ టెస్టు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆస్ట్రేలియా ఊహించినట్టు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ ఆడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ కుమిన్స్ బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్ జట్టు విలవిలలాడింది. కుమిన్స్ దెబ్బకు ఇంగ్లాండ్ ఓపెనర్లు మరోసారి తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ హమీద్ సున్నా పరుగులకు వెనుదిరగగా, క్రౌలీ 12 పరుగులు చేసి ఓటయ్యారు.
ఇంగ్లాండ్ ఓపెనర్‌గా విఫలమైన బర్న్స్ స్థానంలో క్రౌలీని తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎంతోకొంత స్కోర్ చేస్తున్న మలాన్ సైతం తక్కువ స్కోరు (14 పరుగులు)కే ఔటయ్యాడు. దీనితో ఇంగ్లాండ్ జట్టు కేవలం 61 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లను కుమిన్స్ తీయడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ రూట్ ఒక్కడే కొంత వరకు ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ప్రతిఘటించాడు. రూట్ 50 పరుగులు (4I4) చేసి ఔటయ్యాడు. ఆ తరువాత పెద్ద స్కోర్ చేసింది బెయిర్ స్టో 35 పరుగులు, స్టోక్స్ 25 పరుగులు, రాబిన్సన్ 22 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు బట్లర్ 3, వుడ్ 6, లీచ్ 13, అండర్సన్ సున్నా పరుగులు (నాటౌట్)గా నిలిచారు.
కుమిన్స్‌తోపాటు లయాన్ మూడు , స్టార్క్ రెండు, బోలాన్డ్, గ్రీన్‌లు ఒకటి చొప్పున వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 38 (5*4) ఔట్ కాగా, హ్యారీస్ 20 పరుగులు (3*4), లయాన్ పరుగులు చేయకుండా క్రీజ్‌లో ఉన్నారు.
ఇదేం ఓపెనింగ్:
గడిచిన రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు.. తాజాగా జరుగుతున్న మూడువ టెస్టులో తొలి ఇన్నింగ్స్… మొత్తం ఐదు ఇన్నింగ్స్ లలో ఇంగ్లాండ్ ఓపెనర్లు వరుసగా విఫలమవుతూ వస్తున్నారు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లుగా వచ్చిన బర్న్స్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ హమీద్ కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. అదే టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో హమీద్ 27 పరుగులు చేయగా, బర్న్స్ 13 పరుగులు చేశాడు. ఇక రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హమీద్ 6 పరుగులు, బర్స్న్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఓటయ్యారు. కీలకమైన రెండవ ఇన్నింగ్స్‌లో బర్న్స్ 34 పరుగులు చేయగా, హమీద్ డకౌట్ అయ్యాడు. మూడవ టెస్టులో బర్న్స్ స్థానంలో కొత్తగా క్రౌలీని తీసుకోగా, అతను సైతం విఫలమై కేవలం 12 పరుగులు మాత్రమే చేయగా, హమీద్ మరోసారి సున్నా పరుగులకే వెనుదిరిగాడు, ఓపెనర్ల ఘోర వైఫల్యమే ఇంగ్లాండ్ జట్టుకు యాషెస్ సిరీస్‌లో శాపంగా మారింది.