పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వైద్య చికిత్స కోసం నవాజ్ షరీఫ్ లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈనెల 22వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తమ ఎదుట హాజరు పరచాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గతంలో పనామా పత్రాల కేసులో నవాజ్ షరీఫ్‌పై పాకిస్థాన్ సుప్రీంకోర్టు క్రిమినల్ కేసుకు ఆదేశించింది.ఆయన ప్రధాని పదవినుండి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నవాజ్ షరీఫ్ లండన్‌లోని ఎవెన్ ఫీల్డ్ లో అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడని విచారణలో తేలడంతో ఆయనకు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించగా ఆయన కుమార్తె మర్యంకు ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అనంతరం ఆయనను అరెస్టు చేసి లాహోర్ జైలుకు తరలించారు. పనామా పత్రాల కుంభకోణంలో ఆయనపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.
2018లో అల్ అజీజియా స్టీల్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఫ్లాగ్ షిప్ కేసులో మాత్రం ఆయనను కోర్టు నిర్దోషిగా తేల్చింది. అనంతరం వైద్య చికిత్స నిమిత్తం నవాజ్ షరీఫ్ సుప్రీంకోర్టుకు బెయిల్ అప్లై చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా పరిగణనలోకి తీసుకున్న కోర్టు వైద్య చికిత్స కోసం ఆయనకు 6 వారాలపాటు లండన్ వెళ్లేందుకు కూడా అనుమతినిచ్చింది. కాగా గడువు పూర్తి కావడంతో ఆయనను అరెస్టు చేయాలని లండన్‌లోని పాక్ హైకమిషనర్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరో రెండు వారాలు గడువు పొడిగించాలంటూ నవాజ్ షరీఫ్ పెట్టుకున్న అర్జీని ఇటీవల కోర్టు తోసిపుచ్చింది.