అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అది కూడా స్వదేశంలో కాదు. ఇరాన్ లో ఆయనకు ఈ వారెంట్ విడుదల చేశారు. ఆయనపై హత్యానేరం అభియోగం మోపుతూ ఈ వారెంట్ ఇచ్చారు. జనరల్ ఖాసిమ్ సులేమానీ హత్యలో డోనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందని వారు ఆరోపించారు. ట్రంప్ ని అరెస్ట్ చేయాలంటూ ఇరాన్ ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆయనతో పాటు మరికొందరిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ సహాయం కూడా కోరడం విశేషంగా మారింది.
అమెరికా, ఇరాన్ మధ్య సుదీర్ఘకాలంగా వైరం ఉంది. కొంతకాలంగా అది ముదురుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలలో ఇరాన్ తాజా నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడినే అరెస్ట్ చేస్తామంటూ ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికర అంశంగా మారుతోంది. ఓవైపు ఇండో- చైనా సరిహద్దు ఘర్షణలు ముదరుతున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెంచేందుకు ఈ పరిణామాలు దోహదం చేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సులేమనీ హత్యలో ట్రంప్ తో పాటుగా 30 మంది నిందితులుగా ఇరాన్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 3న బాగ్దాద్ లో డ్రోన్ దాడిలో ఆయన మరణించారు. దానికి ప్రధాన కారకులంటూ ట్రంప్ తో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు. వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బెహ్రన్ ప్రోసిక్యూటర్ అలీ అల్ ఖాసి మెహర్ ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇంటర్ పోల్ సహాయాన్ని అర్థిస్తూ ఇరాన్ లేఖ రాయగా అటు నుంచి మాత్రం ఇప్పటి వరకూ స్పందన రాలేదు. ఇక ఈ పరిణామాలపై అమెరికా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎలా స్పందిస్తుందన్నది కూడా చర్చనీయాంశమే. ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో ఇరాన్ నిర్ణయం వేడిని మరింత రాజేస్తున్నట్టుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.