iDreamPost
android-app
ios-app

కాల్వ శ్రీ‌నివాస్ అరెస్ట్ త‌ప్ప‌దా..?

కాల్వ శ్రీ‌నివాస్ అరెస్ట్ త‌ప్ప‌దా..?

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ కు చిక్కులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల అధికారుల‌ను బెదిరించిన కేసులో ఆయ‌న చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రితో సహా 24 మంది టీడీపీ కార్యకర్తలకు అనంతపురం కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించ‌డంపై ఆయా వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అనంతపురం కోర్టు నిరాకరించడంతో కాల్వ అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ కేసే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు కానీ భవిష్యత్తులో ఈ కేసు ఆయనను ఇబ్బంది పెట్టే అవకాశముందని అంటున్నారు న్యాయ నిపుణులు.

అసలేం జరిగిందంటే..

గతేడాది మొదలైన స్థానిక ఎన్నికల్లో రాయదుర్గం పరిధిలో కాల్వ శ్రీనివాస్ అనుచరులు, ముగ్గురు టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే ముగ్గురు పిల్లలున్న కారణంగా వీరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఏకంగా కాల్వ రంగంలోకి దిగారు. ఎన్నికల అధికారులను బెదిరించి, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు నేరుగా కేసు పెట్టారు.కాల్వ శ్రీనివాస్ తోపాటు అధికారులపైకి వెళ్లి దౌర్జన్యం చేసిన 24మంది టీడీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదైంది. ఇన్నాళ్లకు ఆ కేసు విచారణ వేగవంతం కావడంతో ముందస్తు బెయిల్ కోసం కాల్వ కోర్టుని ఆశ్రయించారు.

Also Read:అమరావతి.. ఇంకా తేలలేదు

అయితే అనంతపురం కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. దీంతో కాల్వ అరెస్ట్ ఖాయమని తేలిపోయింది. బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కోర్టు పేర్కొనడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాల్వ శ్రీనివాస్ కేవలం తన ఆధిపత్యం చూపించుకోడానికే స్థానికంగా రచ్చ చేశాడనే విషయం బహిరంగ రహస్యం ఈ క్రమంలో అధికారులపైనే ఆయన దాడికి ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు రాకపోయి ఉంటే.. ఎన్నికల అధికారుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. మొత్తమ్మీద హడావిడి చేయాలని చూసిన కాల్వ ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. అధికారులపై దౌర్జన్యం కేసు కాల్వను ఇప్పుడల్లా వదిలేలా లేదు.