iDreamPost
iDreamPost
కాషాయం కట్టిన వారంతా సర్వపరిత్యాగులనే అభిప్రాయం ఉండేది ఒకనాడు. కానీ ప్రస్తుతం కొందరు కాషాయం ధరించి సకల అరాచకాలు చేస్తుండడంతో స్వామీజీ వేషధారులను సందేహించే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కాషాయధారులే రాజకీయాల్లోకి పదవులు అనుభవించే విషయాన్ని చూస్తున్నాం. కానీ కాషాయ వస్త్రాలలో కనిపించే స్వామి అగ్నివేష్ అలాంటి వారందరికీ అతీతుడు. ప్రజా జీవితం పొడవునా జన సంక్షేమం కోసం కృషి చేసిన ఘనుడు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నుంచి దేశంలోనే అందరూ గుర్తించే స్థాయికి సాగిన స్వామీ అగ్నివేశ్ పయనం ముగిసింది. ఆయన ఢిలీల్లోని ఆస్పత్రిలో కన్నుమూశారు.
వేపా శ్యామ్ రావు అనే పేరుతో ఆయన 1939లో జన్మించారు. శ్రీకాకుళం జిల్లాలోని జన్మించిన ఆయన చిన్నతినంలోనే తండ్రిని కోల్పోయారు. దాంతో చత్తీస్ ఘడ్ లో అమ్మమ్మ ఇంట్లో ఎదిగారు.అ ప్పటికే ఆయన తాత అక్కడ దివాన్ గా వ్యవహరిస్తున్నారు. విద్యాభ్యాసం తర్వాత కోల్ కతా లోని సెంట్ జేవియర్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేశారు. 1970లలో రాజకీయ ప్రవేశం చేశారు. ఆర్య సమాజ్ సిద్ధాంతాల ఆధారంగా ఆర్య సభ పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత 1977 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా నుంచి విజయం సాధించారు. విద్యాశాఖ మంత్రి పనిచేశారు. బానిస విధానంపై పోరాడారు. గనులు సహా ఢిల్లీ సమీపంలోని వివిధ చోట్ల పనిచేసే బాల కార్మికుల విముక్తి కోసం కృషి చేశారు. వివిధ పోరాటాల్లో పలుమార్లు అరెస్ట్ అయ్యారు. 14 నెలల పాటు జైలుజీవితం కూడా గడిపారు.
అనంతరం వివిధ సామాజిక సమస్యలపై ఆయన పనిచేశారు. 2011లో మావోయిస్టులకు చిక్కిన పోలీసులను విడిపించేందుకు వారితో చర్చలు జరిపారు. చత్తీస్ ఘడ్ ప్రాంతంలో మావోయిస్టులు. పోలీసుల మధ్య వివాదంలో నష్టపోయిన గిరిజనులకు అండగా నిలిచారు. మహిళల హక్కుల కోసం పోరాడారు. సతీ వంటి ఆచారాలపై ఉద్యమించారు. జార్ఖండ్ రాష్ట్రంలో కూడా పలు సమస్యల మీద కృషి చేశారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో కీలక భూమిక పోషించారు. మన్మోహన్ సింగ్ హయంలో మావోయిస్టులతో చర్చల కోసం నాటి ప్రధాని అగ్నివేశ్ చొరవ చేయాలని ఆశించారు. పశ్చిమ బెంగాల్ లో మమతా ప్రభుత్వం తరుపున అగ్నివేశ్ చేసిన ప్రయత్నంలోనే సీనియర్ నేత ఆజాద్ మరణానికి దారితీసిందనే ప్రచారం ఉంది.
అంతర్జాతీయంగానూ అగ్నివేష్ వివిధ సంస్థలతో కలిసి పనిచేశారు. అమ్నీస్టీలో కొంత కాలం కొనసాగారు. సౌదీ అరేబియా, స్పెయిన్ వంటి దేశాలతో చర్చల్లో పాల్గొన్నారు. కశ్మీర్ లో పండిట్ల విషయంలో ఆయన కృషి చేశారు. గౌరీ లంకేశ్ హత్య సమయంలో ఆయన పోరాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుని తీవ్రంగా నిరసించారు. దాంతో పలు సంస్థలకు ఆయన కంటగింపుగా మారారు. అంతకుముందు పూరీ ఆలయంలో హిందువేతరులకు కూడా ప్రవేశం విషయంలో ఆయనపై విమర్శలు గుప్పించారు. కశ్మీర్ లో అగ్నివేశ్ కృషిని నిరసిస్తూ ఆయన్ని హత్య చేస్తే 20లక్షలు ఇస్తామంటూ హిందూమహాసభ ప్రకటన కూడా చేసింది.
చివరకు జార్ఖండ్ లో ఓసారి ఆయనపై దాడి యత్నం కూడా జరిగింది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా అట్టగుడు వర్గాల కోసం ఆయన గొంతు వినిపిస్తూనే వచ్చారు. ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయకుండా సాగారు. చివరకు 80 ఏళ్ల వయసులో కూడా ఆయన అవిశ్రాంతంగా తిరిగేవారు. కానీ తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రెండు రోజుల క్రితం ఢిల్లీ ఆస్పత్రిలో చేరారు. చివరకు ప్రాణాలు విడిచారు. దాంతో ఆయన మృతి దేశంలో హక్కుల ఉద్యమానికి, బాధితులకు తీరని లోటుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. తాను అనుకున్న లక్ష్యాల కోసం ఆరంభం నుంచే ఆటంకాలు అధిగమించి పోరాడిన నేతగా ఆయన నిలిచిపోతారని కొనియాడుతున్నారు.