iDreamPost
android-app
ios-app

బాబు ఆశలపై నీళ్లు..!

బాబు ఆశలపై నీళ్లు..!

తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి, తన అనుభవాన్ని అంతా రంగరించి అమరావతి కోసం ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటం అంతా నీరుగారిపోతోంది. ప్రజలను అమరావతి వైపు మళ్లించాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ బెడిసికొడుతున్నాయి. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న మాదిరిగా చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లేలా పరిస్థితులు మారుతున్నాయి.

అమరావతి తన కల అని చెప్పుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ ప్రజల కల, ప్రజల భవిష్యత్‌ అంటూ స్వరం మార్చి.. అమరావతే ఏకైక రాజధానిగా ఉండేలా ఉద్యమాలు, పోరాటాలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. పదే పదే దగ్థద స్వరంతో వేడుకున్నారు. అయినా ప్రజల్లో కనీస స్పందన రాకపోవడంతో ఎలాగైనా వారిని అమరావతి ఉద్యమంలో భాగస్వాములను చేయాలని సరికొత్తగా ఆలోచించి ఏపీ విత్‌ అమరావతి అనే వెబ్‌సైట్‌ను ఈ నెల 24వ తేదీన ప్రారంభించారు. అమరావతికి మద్ధతుగా అందరూ సదరు వెబ్‌సైట్‌కు వచ్చి ఓటు వేయాలని, తద్వారా అమరావతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 

24వ తేదీన ఈ వెబ్‌సైట్‌ ప్రారంభం కాగా 36 గంటల్లో 3 లక్షల మంది వెబ్‌సైట్‌కు వచ్చి ఓటు వేయడంతో చంద్రబాబులో ఆశలు చిగురించాయి. ఆయన అనుకూల మీడియా కూడా ఈ విషయాన్ని గొప్పగా ప్రచురించాయి, ప్రసారం చేసాయి. అయితే కాలం గడిచే కొద్దీ చంద్రబాబు ఆశలు ఆవిరైపోతున్నాయి. ఈ రోజు శనివారం రాత్రి 8 గంటల సమయానికి సదరు వెబ్‌సైట్‌కు వచ్చి ఓటు వేసిన వారి సంఖ్య 3.78 లక్షల మంది మాత్రమే. మొదటి 36 గంటల్లో(ఒకటిన్నర రోజు) 3 లక్షల మంది ఓటు వేయగా.. తర్వాత నాలుగున్న రోజులో కేవలం 78 వేల మంది మాత్రమే అదనంగా ఓటు వేశారు. మొదటి రోజు 2 లక్షల మంది ఓటు వేయగా.. చివరి నాలుగు రోజుల్లో రోజుకు దాదాపు 17 వేల మంది మాత్రమే ఓటు వేయడం గమనార్హం.

ఓటు వేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో చంద్రబాబు అండ్‌ కో లో నిరాశమొదలైందని టాక్‌. సదరు వెబ్‌సైట్‌కు వచ్చిన ఓట్ల గురించి రాబోయే జూమ్‌లో ‘ఇది ప్రజల నాడి’ అని చెబుదామనుకున్న చంద్రబాబుకు ఇది ఆశనిపాతమేనన్న   వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.