iDreamPost
android-app
ios-app

ప్రక్షాళనకు భారీగా సూచనలు.. మార్పులు తప్పదా..?

ప్రక్షాళనకు భారీగా సూచనలు.. మార్పులు తప్పదా..?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌(ఏపీపీఎస్సీ)ను సమూలంగా ప్రక్షాళన చేయాలని పలువురు మేధావులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ పి.ఉదయభాస్కర్‌ నియంతృత్వ పోకడల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, ఆయన్ను తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారి కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు సోమవారం మేధావులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. కమిషన్‌లోని లోపాలు సరిదిద్దేందుకు సలహాలు, సూచనలు స్వీకరించారు.

సమావేశం లో వచ్చిన సూచనలు …

1. ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ విధానం కోసం కర్ణాటకలో మాదిరిగా చట్టం చేయాలి.
2. రాష్ట్ర సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.
3. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్‌ వాడుకున్నా.. మెయిన్స్‌లో మెరిట్‌లో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓపెన్‌ కేటగిరీ పోస్టులు ఇవ్వాలి.
4. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షల్లో 75కు పైగా ప్రశ్నల్లో తప్పులు ఇతర లోపాలున్నందున దాన్ని రద్దుచేసి తిరిగి నిర్వహించాలి.
5. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆన్‌లైన్‌కు అలవాటు పడేవరకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలి.
6. నోటిఫికేషన్‌కు ప్రిలిమ్స్‌కు మధ్య 5 నెలలు.. అనంతరం మెయిన్స్‌కు 4 నెలల సమయమివ్వాలి.
7. వివిధ పరీక్షల మోడల్‌ పేపర్లను ముందుగానే విడుదల చేయాలి.
8. హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాలి.
9. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నారు. దాన్ని వెంటనే అమలు చేయాలి.
10. ఆంగ్లం, తెలుగు ప్రశ్నల్లో ఏది తప్పైతే దాన్నే రద్దుచేయాలి. స్కేలింగ్‌ను కూడా రద్దుచేయాలి.
11. గ్రూప్‌–2లో ఎగ్జిక్యుటివ్‌ పోస్టులు యధాతథంగా భర్తీచేయాలి.
12. నిబంధన– 7ను పునరుద్ధరించి పోస్టుల్ని తదుపరి నోటిఫికేషన్లకు మళ్లించకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలి.
13. అభ్యంతరాలు నేరుగా లేదా పోస్టు ఇవ్వమనడంతో నష్టపోతున్నాం. ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు అవకాశం కల్పించాలి.
14. మెయిన్స్‌ పరీక్షల్లో మార్కులను ఇంటర్వ్యూలకు ముందుగా ప్రకటిస్తూ కమిషన్‌లోని సభ్యులు బేరసారాలు సాగిస్తున్నారు. సెలెక్షన్‌ పూర్తయ్యాకే మార్కులు ప్రకటించాలి.
15. యూనివర్సిటీ అసిస్టెంటు ప్రొఫెసర్‌ పోస్టులు ఏపీపీఎస్సీతో సంబంధం లేకుండా పాతవిధానంలో భర్తీచేయాలి.
16. సిలబస్‌ కనీసం ఆరేళ్లపాటు కొనసాగేలా చూడాలి.
17. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలి. అన్ని పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులు తీసేయాలి.
18. రెండు మూడు ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటుచేయాలి
19. ప్రశ్నపత్రాల తయారీకి ప్యానెల్‌ ప్రొఫెసర్ల ఎంపిక పగడ్బందీగా ఉండాలి.
20. ప్రశ్నల రూపకల్పనలో సమతూకం ఉండాలి.
21. ప్రశ్నల్లో తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి