Idream media
Idream media
కరోనా కేసుల కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది. దేశంలోనే అత్యుత్తమంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కూడా కొత్తగా 2,477 కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు సెకండ్ వేవ్ ఉధృతితో ఫ్రాన్స్, యూరప్ వంటి దేశాలు అల్లాడుతున్నాయి. పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కరోనా భయంతో ఆ సమావేశమే పార్టీల వారీగా విడివిడిగా జరిపారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఆలోచన సరికాదని ఉద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యంతో పాటు ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెడతారా అంటూ ఆవేదన చెందుతున్నారు.
వైరస్ బారిన 11,200 మంది పోలీసులు
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. దేశంలో మరే రాష్ట్రంలో చేయనన్ని టెస్టులు చేస్తూ రోగులను గుర్తించి వ్యాప్తిని అరికడుతోంది. ఇంతచేస్తున్నా పోలీసుల్లోనే 11,200 మంది వైరస్ బారినపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులదీ అదే పరిస్థితి. బ్యాలెట్ పేపరు ద్వారా జరిగే స్థానిక ఎన్నికల్లో వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువ. కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకు స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులను రక్షించుకునేందుకు కోర్టుకైనా వెళతామన్నారు. చాలా యూరప్ దేశాల్లో సెకండ్‌వేవ్ మొదలైంది. మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు. మనదేశంలో కూడా ఆ ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎన్నికల సంఘాన్ని కోరతాం.. లేదంటే…
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరతామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఆయన మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదన్నారు. ఈ మేరకు ఈసీకి విన్నవిస్తామని చెప్పారు. అయినప్పటికీ ఎన్నికలకు కు సిద్ధమైతే తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామన్నారు. ఇదిలా ఉండగా.. 65 ఏళ్లు దాటినవారు, పిల్లలు బయటకు వెళ్లవద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రధాని మోదీ కూడా మన్‌కీ బాత్‌లో సూచించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వాయిదా వేసిన ఎన్నికల నిర్వహణకు ముందుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. రమేష్ మాత్రం ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించడం కూడా చర్చకు తావిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తొమ్మిది తీర ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో చలికాలంలో చలితీవ్రత అధికంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల కన్నా చలికాలంలో వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. ఈ పరిస్థితులో స్థానిక ఎన్నికల నిర్వహణ సామాన్య ప్రజల ఆరోగ్యంతో చెలగాటమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.