iDreamPost
android-app
ios-app

విధేయతకే పెద్ద పీట, విశ్వాసంతో పనిచేసిన వారికి గుర్తింపునిచ్చిన జగన్

  • Published Sep 25, 2021 | 11:41 AM Updated Updated Sep 25, 2021 | 11:41 AM
విధేయతకే పెద్ద పీట, విశ్వాసంతో పనిచేసిన వారికి గుర్తింపునిచ్చిన జగన్

వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్న నాటి నుంచి కష్టపడిన నేతలు అనేక మందికి తగిన స్థానం దక్కింది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర మంత్రివర్గం వరకూ పార్టీలో విశ్వసనీయంగా పనిచేసిన వారికే అవకాశాలు వచ్చాయి. పార్టీ అబివృద్ధికి పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న వారికి తగిన స్థానాలు దక్కాయి. జగన్ వెంట నడుస్తూ ఆరంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్న వారికి కూడా గుర్తింపు లభించడం విశేషం. 2019 ఎన్నికల్లో పరాజయం పాలయిన నేతలందరికీ ప్రత్యామ్నాయంగా అవకాశాలు ఇవ్వడమే గాకుండా, 2014 ఎన్నికల్లో ఓడిన నేతలను కూడా అందలం ఎక్కించడం జగన్ నైజాన్ని చాటుతుంది.

సహజంగా రాజకీయ పార్టీలలో ఓడిపోయిన నేతలకు పెద్దగా విలువ ఉండదు. పైగా గెలిచిన వారి పెత్తనం మొదలవుతుంది. దాంతో అనివార్యంగా ఓటమి చవిచూసిన వాళ్లంతా తెరమరుగయ్యే పరిస్థితి అనేక సందర్భాల్లో చూస్తుంటాం. కానీ నమ్ముకున్న వారికి చేదోడుగా నిలిచే అలవాటు వైఎస్సార్ నుంచి జగన్ అందిపుచ్చుకున్నట్టు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా వివిధ వర్గాలకు చెందిన వారిని ఆదరించి పదవులు కట్టబెడుతున్నారు.

Also Read : పనితీరుకు పట్టం.. జడ్పీ చైర్మన్ల ఎంపిక పూర్తి

తాజాగా జెడ్పీ పీఠాలు దక్కించుకున్న వారిని గమనిస్తే శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకూ అనేక జిల్లాల్లో తన వెంట నడిచిన వారిని జగన్ అక్కున చేర్చుకున్న సంగతి అర్థమవుతుంది. శ్రీకాకుళంలో పిరియా సాయిరాజ్ టీడీపీని ఎదురొడ్డి నిలిచిన నేత. వైఎస్ కాలం నుంచి ఆయన ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. చివరకు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించే అవకాశం రాకపోయినా ఇప్పుడు జెడ్పీ పీఠం ఆయన భార్య పిరియ విజయ దక్కించుకున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ విప్పర్తి వేణుగోపాల్ ది కూడా అదే పరిస్థితి. తన ఉద్యోగం నుంచి రిటైర్ కాగానే వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికలలో పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. అయినా జగన్ వెంట నడుస్తూ ఉండడంతో ఏడున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఆయనకి జెడ్పీ పీఠం దక్కింది.

కృష్ణా జిల్లాలో కూడా ఉప్పాల రామ్ ప్రసాద్ 2014 ఎన్నికల్లో కైకలూరు నుంచి పరాజయం పాలయ్యారు. కానీ ఆయనకు తగిన స్థానం కల్పించేందుకు ఇన్నాళ్లు వేచి చూసిన జగన్ ఇప్పుడు జనరల్ మహిళకు రిజర్వ్ అయిన స్థానంలో బీసీ మహిళగా ఆయన కుటుంబానికి చెందిన ఉప్పాల కల్పనను జెడ్పీ చైర్ పర్సన్ చేశారు. తద్వారా జగన్ విశ్వసనీయతకు నిదర్శనం అనే మాటను నిలబెట్టుకున్నారు. ఇక గుంటూరులో హెన్రీ క్రిస్టియానా కూడా 2014 ఎన్నికల్లో పరాజయం పాలయిన నాయకురాలు. తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెను ఇప్పుడు జిల్లా పరిషత్ ప్రధమ పౌరురాలిగా ఎంపిక చేసిన ఘనత తన తీరుని చాటుకున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా బాచేపల్లి కుటుంబం నుంచి బాచేపల్లి వెంకాయమ్మకు పీఠం కట్టబెట్టారు. దర్శి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారి కుటుంబానికి ఇప్పుడు జెడ్పీ పీఠం దక్కడంతో జగన్ నిబద్ధతను చాటుకున్నట్టయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కవురు శ్రీనివాస్ కూడా అదే రీతిలో అవకాశం దక్కించుకున్నారు. ఆయన ఇప్పటికే డీసీసీబీ పదవి అనుభవించగా ప్రస్తుతం జెడ్పీ పీఠం మీదకి ఎక్కారు. కడపలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా ఈ విధంగానే న్యాయం జరిగినట్టయ్యింది.

Also Read : కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎప్పటి వరకు పదవిలో ఉంటారో తెలుసా?

ఇప్పటికే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్పార్సీపీకి చెందిన 24 మందిలో దాదాపు అందరికీ వివిధ హోదాల్లో అవకాశాలు దక్కాయి. ఇప్పుడు 2014 ఓటమి పాలయిన వారికి కూడా చాన్స్ దక్కడం విశేషం. తద్వారా జగన్ మార్క్ రాజకీయాలు జనాలకు అర్థమయ్యేలా ఈ పదవుల పంపిణీ జరిగినట్టు కనిపిస్తోంది. వివిధ జిల్లాల్లో జెడ్పీ పీఠాల కోసం తీవ్ర పోటీ ఎదురయినా జగన్ మాత్రం తనదైన శైలిలో ఎంపిక పూర్తి చేశారు. వెనుకబడిన వర్గాలు, మహిళలకు పెద్ద పీట వేయడం ద్వారా ప్రత్యేకత చాటుకున్నారు.