iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలు- సంక్షేమ క్యాలెండర్ అమలులో లబ్ధిదారులు అందరికీ సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రయోజనం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఏడాదిలో రెండుసార్లు అర్హుల జాబితాను సరిచూసి పథకాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైనప్పటికీ సకాలంలో దరఖాస్తు చేసుకోని వారికి ఊరటనిస్తూ మరో అవకాశం కల్పించారు.
అర్హత ఉంటే దరఖాస్తుకు అవకాశం..
సామాజిక తనిఖీల సందర్భంగా అనర్హులుగా తేలినవారికి కూడా ఆ తరువాత అర్హత పొందితే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా వివిధ పథకాలకు ఇప్పటివరకు 4,92,013 మంది దరఖాస్తు చేసుకోగా 3,89,786 మంది అర్హులుగా తేలారు. గతంలో పథకాల అమలు సందర్భంగా సాంకేతిక కారణాలతో నగదు జమ కాని వారు 1,11,757 మంది ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ డిసెంబర్ నెలలో నగదు జమ చేయనున్నారు. 5,01,543 మందికి మొత్తం రూ.652.79 కోట్ల మేర నగదు జమ కానుంది.
కేబినెట్లో నిర్ణయం..
నవరత్నాలు – సంక్షేమ కేలండర్ అమలు సందర్భంగా అర్హులైన లభ్దిదారులెవరైనా మిగిలిపోతే వారిని గుర్తించి ఏడాదిలో రెండుసార్లు ప్రయోజనం చేకూర్చాలని ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా నవంబర్ వరకూ అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారులు అందరికీ డిసెంబర్లో లబ్ధి కలగనుంది. ఆ తరువాత మే వరకూ అర్హులుగా గుర్తించే లబ్ధిదారులకు జూన్ నెలలో లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు.
అర్హులకు మరో అవకాశం..
గడువులోగా దరఖాస్తు చేసుకోనప్పటికీ అర్హులకు మరో అవకాశం కల్పించి ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడువు తీరిన తరువాత దరఖాస్తు చేసుకున్న అర్హులను గుర్తించడంతోపాటు ఇప్పడు అర్హత పొందిన వారికి కూడా డిసెంబర్ నెలలో నగదు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
గత సర్కారు హయాంలో సంక్షేమంలో కోత..
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల్లో విపరీతంగా కోతలు విధించేవారు. అర్హులైనప్పటికీ లబ్ధి చేకూర్చకుండా ఎలా కోతలు పెట్టాలనే ఆలోచనలు చేసేది. అందుకు భిన్నంగా ఏడాదిలో రెండుసార్లు అంటే డిసెంబర్, జూన్ నెలల్లో అర్హులను గుర్తించి నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Special Status -ప్రత్యేక హోదాపై పట్టువీడని జగన్