iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ని టూరిజంపరంగా అభివృద్ధి చేసేందుకు కొత్త విధానం రూపకల్పన చేస్తున్నట్టు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. వారం రోజుల్లో దానికి సంబంధించిన పాలసీ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కరోనా కారణంగా నెలకు కోటి రూపాయల చొప్పున ఏపీ టూరిజం ఆదాయం కోల్పోయిందన్నారు. అయినా వాటి నుంచి కోలుకుని ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు.
కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో పర్యాటకులకు అన్ని చోట్లా తలుపులు తెరుస్తున్నట్టు వెల్లడించారు. విజయవాడలోని భవాని ఐల్యాండ్‌ను ఈ నెల 10వ తేదీన తిరిగి ప్రారంభిస్తామన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన తరువాత బోటింగ్ కి అనుమతి ఇస్తామని తెలిపారు. దానికి అనుగుణంగా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కోవిడ్ కేంద్రాలుగానూ, ఆహార సరఫరా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 38 ఏపీ టూరిజం హోటళ్ల ద్వారా 28 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. తిరుపతి, విశాఖలో స్టార్ హోటళ్లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. దానికి ఓబెరాయ్ సంస్థ ముందుకు వస్తుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పాపికొండలకు తప్ప అన్ని చోట్లకు బోటింగ్‌కు అనుమతినిచ్చామని చెప్పారు. 60 బోట్లు తిరిగేందుకు అనుమతి ఉందన్నారు. బోటింగ్ జరిగే చోట కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి టూరిజం శాఖ కమాండ్ కంట్రోల్ నిర్వహణ చేస్తుందన్నారు. గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అవంతి చెప్పారు.
కుదుటపడుతున్న ఆర్థిక వ్యవస్థ , ఆంధ్రాలో వేగంగా పుంజుకుంటున్న వాణిజ్యం
ఆంద్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది. కరోనా లాక్ డౌన్ తో కుదేలయిన స్థితి నుంచి క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. దేశవ్యాప్తంగా పుంజుకుంటున్న వ్యాపార, వాణిజ్యాల స్థాయితో పోలిస్తే ఏపీలో మరింత వేగంగా కనిపిస్తోంది. గత ఏడాదితో పోల్చినా ప్రస్తుత సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండడం శుభసూచికగా భావిస్తున్నారు. మళ్లీ ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడిలో ప డేందుకు ఈ వసూళ్లు దోహదపడతాయని భావిస్తున్నారు. అయితే కేంద్రం సకాలంలో వాటిని రాష్ట్రాల వాటా ప్రకారం విడుదల చేయాల్సి ఉంటుంది.
గత ఏడాది అక్టోబర్ లో నెలలో ఏపీలో రూ. 1975 కోట్లు జీఎస్టీగా వసూలయ్యింది. ఈ ఏడాది అది ఏకగా రూ. 2,480 కోట్లకు పెరిగింది. దాంతో 26 శాతం పెరుగుదల నమోదయ్యింది. దేశవ్యాప్తంగా ఇది 10 శాతం ఉంటే ఏపీలో దానికి రెట్టింపు దాటి ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా ప్రధాన రాష్ట్రాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అందరికన్నా ముందు నిలిచింది.
వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో పురోగతికి ఈ వసూళ్లు సూచికగా నిలుస్తున్నాయి. మళ్లీ ఆర్థిక పరిస్థితి పుంజుకునే దిశలో పరిణామాలున్నట్టు చెబుతోంది. వాస్తవానికి ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలో కరోనా మరింత తీవ్రంగా ప్రభావం చూపింది. అయినప్పటికీ సంక్షేమం విషయంలో వెనకడుగు వేయకుండా జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో జీఎస్టీ బకాయిల విడుదలలో కేంద్రం తాత్సార్యం చేస్తోంది. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలతో ఏపీలాంటి రాష్ట్రాలకు గుదిబండగా మారే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో జీఎస్టీ వసూళ్లు పుంజుకోవడం మూలంగా కేంద్రం పునరాలోచన చేసి బకాయిల విడుదలకు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట అవుతుంది.