iDreamPost
iDreamPost
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తానని వాగ్దానం చేసిన జగన్ చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న రోజు నుంచే తన పారిపాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలను తీసుకున్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నానని తన మంత్రివర్గంలో ఉన్న మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా విచారిస్తానని.. ఒకవేళ రుజువైతే తక్షణమే తొలగిస్తానని, అటు ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని తన తొలి మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేశారు. దానికి తగ్గట్టుగానే ఆయన అడుగులు వేస్తూ వచ్చారు.
గడిచిన ఏడాదిన్నరలో ఎన్నిసంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా, విప్లవాత్మకమైన సంస్కరణలను అమలు చేసినా ఎక్కడా అవినీతి అంటూ సహేతుకమైన విమర్శ తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడంలో జగన్ సఫలీకృతం అయ్యారనే చెప్పాలి. రాష్ట్రంలో ఏళ్ళ తరబడి ప్రభుత్వ శాఖల్లో పాతుకుపొయిన అవినీతిని నిర్మూలించేందుకు ప్రతిష్టాత్మక ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో జగన్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో ఏసీబీ వ్యవస్థను సైతం మరింత బలోపేతం చేశారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షంపై అవినీతి విమర్శలు చేస్తుంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష పార్టీకి ఆ ఆస్కారం లేక కులం, మతం, ప్రాంతం అంటూ అర్ధరహిత విమర్శలకు దిగుతూ ప్రజల్లో మరింత చులకనైంది.
ఇక తాజాగా ఉపాధి హామీ పనుల కింద జరిగిన పనుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా, లబ్ధిదారులకు ఫలాలు చేరాయా? లేదా? పని నాణ్యతతో చేశారా.. లేదా? అన్న అంశంపై ఇప్పటికే రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించుకున్న కేంద్రం అన్ని రాష్ట్రాల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించింది. ఈ మేరకు రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఉపాది హామీ పనుల అత్యంత పారదర్శకమైన సోషల్ ఆడిట్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.