iDreamPost
android-app
ios-app

గవర్నర్‌ వద్దకు ఆ రెండు బిల్లులు

గవర్నర్‌ వద్దకు ఆ రెండు బిల్లులు

రాష్ట్ర సమాగ్రాభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదల్చుకున్న మూడు రాజధానులపై కీలక ముందడుగుపడింది. గత బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదించిన సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదానికి పంపింది. ఈ బిల్లులు శాసన సభలో ఆమోదించి నెల రోజులైంది. శాసన మండలికి పంపగా ఈ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. బడ్జెట్‌ను కూడా మండలి ఆమోదించలేదు. సభలో బిల్లులు ప్రవేశపెట్టిన నెల తర్వాత మండలి ఆమోదించకున్నా.. యథావిధిగా పాస్‌ అయిపోయినట్లేనని చట్టం చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రెండు బిల్లులు గవర్నర్‌ వద్దకు చేరాయి. ఇక గవర్నర్‌ ఆమోదమే మిగిలింది.

ఈ రెండు బిల్లులపై ఏపీలోని అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం ఈ రెండు బిల్లులను శాసన సభలో రెండు సార్లు ప్రవేశపెట్టింది. మొదట శీతాకాల సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెట్టగా శాసన సభలో ఆమోదం పొందాయి. మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండడంతో అక్కడ నిలిచిపోయాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటికి పంపాలని టీడీపీ పట్టుబట్టింది. నిబంధనలకు విరుద్ధం అంటూనే విచక్షణాధికారం మేరకు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించారు. అయితే అలా చేయడం నిబంధనలకు విరుద్ధం అంటూ మండలి కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఈ క్రమంలో మండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కరోనా కారణంగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు అర్థంతరంగా ముగియడంతో మండలి రద్దు ప్రక్రియ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను గత నెలలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. శాసన సభలో ఆమోదించి మండలికి పంపగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సభ్యుల వాదోపవాదాల మధ్య మండలి వాయిదా పడింది. బిల్లులు ప్రవేశపెట్టి నెల రోజులు పూర్తయితే యథావిధిగా ఆమోదం పొందినట్లే. అందుకే ఈ రోజు ప్రభుత్వం ఆ రెండు బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపాయి.

అయితే ఆ బిల్లులను ఆమోదించవద్దని టీడీపీ గవర్నర్‌ను కోరుతోంది. ఈ మేరకు మండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయం తీసుకోవడంలేదని, మీరైనా ప్రజాభిప్రాయం తీసుకోవాలంటూ గవర్నర్‌ను కోరారు. యనమల రామకృష్ణుడు.. ఆ రెండు బిల్లులు ఇంకా సెలక్ట్‌ కమిటీ వద్ద ఉన్నాయని కూడా వాదిస్తున్నారు. ఈ మేరకు తనకు తెలిసిన రూల్స్‌ను చెబుతూ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. అదే క్రమంలో అమరావతి జేఏసీ కూడా ఆ బిల్లులను ఆమోదించవద్దని గవర్నర్‌ను కోరుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా టీడీపీ తరహాలోనే ఆ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమంటూ.. ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.