Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగూ ఆసక్తికరంగా మారుతోంది. చేపట్టే ప్రతి కార్యక్రమమూ ఓ సంచలనం అవుతోంది. 30 మే 2019 మధ్యాహ్నం 12.23 గంటలకు వైఎస్ జగన్ అను నేను.. అంటూ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ ఏపీ పాలనలో విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. ఈ 19 నెలల కాలంలో జగన్ ప్రారంభించిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగానే చర్చనీయాంశంగా మారాయి. అందులో ఒకటి జగనన్న విద్యాకానుక. ఏపీలోనే కాదు.. ఎన్నో రాష్ట్రాల్లో ఇప్పుడంతా ఆ పథకం కోసమే చర్చ. పథకం ప్రారంభం సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోగతాన్ని చూసి ఆ పథకం ఎంతలా ఆకట్టుకుందో అందరూ గమనించారు. అందరితో పాటూ ఆశ్చర్యపోవడం ప్రభుత్వ ఉపాధ్యాయుల వంతైంది. అందుకు గల కారణాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
తొలి సాక్షులు ఉపాధ్యాయులే
ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేస్తున్న వారిలో అధిక మంది ప్రభుత్వ పాఠశాలలలో చదివిన వారే. అందులో సందేహం లేదు. వారు చదువుకునే రోజుల్లో పాఠశాలలు ఎలా ఉండేవో.. ఉద్యోగంలో చేరినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలంటే అదే భావన చాలా చోట్ల ఉండేది. అయితే నాడు – నేడు ప్రారంభం అయ్యాక పాఠశాలల రూపురేఖల్లో విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. ఆ మార్పులను తొలిసారిగా గుర్తించింది ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఎందుకంటే లాక్ డౌన్ కాలంలోనూ దగ్గరుండి ఆ పనులను పర్యవేక్షించింది వారే కాబట్టి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 44,512 ప్రభుత్వ బడులున్నాయి. వాటిని మూడు దశలుగా విభజించారు. తొలి ఏడాది 15,715 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో 15.024 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి.
అన్నీ బ్రాండెడే..
ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల కోసం వినియోగిస్తున్న సామగ్రి మొత్తం ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు చెందినవే. పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు వస్తున్న ఆ వస్తువులను చూస్తూ ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేవారు. ప్రభుత్వ పథకాలకు ఇంత ఖరీదైన సామగ్రి వాడడం ఇదే ప్రథమమని వారిలో చర్చ జరిగేది. టాయిలెట్లు, బల్లలు, ఫ్యాన్లు, లైట్లు.. ఇలా ఏదైనా సరే బ్రాండెడ్ కంపెనీలివే వాడాలని ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి వస్తువుకు సంబంధించి మూడు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేర్లతో కూడిన బుక్ లెట్ లను వారికి ఇచ్చి తమకు అందుబాటులో ఉన్న కంపెనీల వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చునని పాఠశాల అభివృద్ధి కమిటీలకే నిధులు అప్పగించింది. గతానికి భిన్నంగా పథకం అమలులో వైసీపీ ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఆ పార్టీని వ్యతిరేకించే ఉపాధ్యాయులు కూడా జగన్ కు హ్యాట్సాప్ చెబుతున్నారు.
విద్యా కానుక మరో ఎత్తు..
నాడు – నేడు పథకంలో భాగంగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోవడం ఓ ఎత్తయితే.. జగనన్న విద్యా కానుకలను చూసి ఉపాధ్యాయులు మళ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలు, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్, బెల్ట్, నోట్‌బుక్‌లు, స్కూల్‌బ్యాగ్, మాస్కులతో కూడిన ఆ కిట్ లతో ప్రభుత్వం అందించే కానుక ఇంత కాస్ట్లీగా ఉండడం, వాటిని పుచ్చుకుంటూ విద్యార్థుల ఆనందాన్ని చూసి ఉపాధ్యాయులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభమైతే రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా జగనన్న బ్యాగులతో ఉత్సాహంగా బడులకు కదిలే విద్యార్థులే దర్శనమిస్తారని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని సిరిపురం జడ్పీహెచ్ ఎస్ పీడీ శ్రీలక్ష్మి పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించేందుకు ప్రభుత్వం దాదాపు రూ.650 కోట్లు వెచ్చించడం విదితమే.