Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం పోలింగ్ ముగిసింది. కృష్ణా-గుంటూరు, తూర్పు- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోనూ భారీ పోలింగ్ నమోదైంది. కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానానికి 93.01 శాతం, తూర్పు-పశ్చిమగోదావరి స్థానానికి 91.91 శాతం పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ ను బట్టి అభ్యర్థులు గెలుపు అవకాశాలను అంచనా వేసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్థానాలను ఎవరు సొంతం చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
విజయంపై ఎవరి ధీమా వారిదే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా-గుంటూరు స్థానం నుంచి 19 మంది బరిలో ఉండగా, ప్రధానంగా ఐదుగురి మధ్యే పోటీ జరిగినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని పార్టీలు ఆయా అభ్యర్థులకు మద్దతుగా నిలిచాయి. వైసీపీ పరోక్ష మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే పీడీఎఫ్ మద్దతుతో పోటీ చేసిన బొడ్డు నాగేశ్వరరావు తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ మద్దతుతో పోటీ చేసిన డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, ఏపీటీఎఫ్ మద్దతుతో బరిలో నిలిచిన పాండురంగ వరప్రసాద్ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. కాగా మొత్తం 13,505 మంది ఓటర్లు ఉండగా.. 93.01 శాతం పోలింగ్ నమోదైంది. ఇక తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ ఉంది. పీడీఎఫ్ మద్దతుతో పోటీ చేసిన షేక్ సాబ్జీ, టీఎన్‌యూఎస్ మద్దతుతో బరిలో నిలిచిన చెరుకూరి సుభాష్ చంద్రబోస్, వైసీపీ మద్దతుదారు గంధం నారాయణ రావు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా మొత్తం 17,467 మంది ఓటర్లు ఉండగా.. 91.91 శాతం పోలింగ్ నమోదైంది.
ఇటు తెలంగాణలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భారీగా పెరిగింది. 2009, 2015లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నమోదైన పోలింగ్ శాతం కంటే 2021 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా ఉంది. కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 2009లో 79.24 శాతం, 2015లో 68.92 శాతం నమోదు అయ్యాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఏకంగా 93.01 శాతం నమోదుకావడం ఆసక్తిగా మారింది.
అదేవిధంగా తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి 2009లో 88.55 శాతం, 2015లో 82.14 శాతం నమోదు అయ్యాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో పోలింగ్ 91.91 శాతంగా నమోదైంది. పెరిగిన పోలింగ్ ను కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులు గెలుపోటములు బేరీజు వేసుకుంటున్నారు. రెండు, మూడు ప్రాధాన్యతా ఓట్లు కూడా తమకు అక్కరకు వస్తాయని భావిస్తున్నారు. రేపు వెలువడనున్న ఫలితాలతో విజయం ఎవరి వైపు ఉందనేది తేలనుంది.