iDreamPost
android-app
ios-app

ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే ఏపీ మూడో స్థానం

ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే ఏపీ మూడో స్థానం

భారీ అప్పులతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ప్రతిపక్ష పార్టీలు ప్ర‌చారం చేస్తున్న త‌రుణంలో నీతి ఆయోగ్ నివేదిక వారికి షాక్ ఇచ్చేలా ఉంది. ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌జా సంక్షేమానికి ఖ‌ర్చు చేస్తున్న ఏపీ ప్ర‌భుత్వం ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు కూడా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విష‌యం ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. స్థిర ఆర్థికాభివృద్ధిలో ఏపీ దేశంలోని ఇత‌ర రాష్ట్రాల కంటే ముందంజ‌లో ఉంద‌ని పేర్కొంది.

ఆర్థికాంశాలతో పాటు ప్రాధాన్యం ఉన్న జాతీయ, అంతర్జాతీయ విషయాలపై సూచనలిచ్చే నీతి అయోగ్ స్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్ ర్యాంకుల జాభితాను విడుదల చేసింది. ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో ఏపీ ముందంజ‌లో ఉన్న‌ట్లు పేర్కొంది. ఐరాస-సమ్మిళిత అభివృద్ధి ఇండియా ఇండెక్స్ టాప్-5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. పలు అంశాల్లో మంచి పనితీరు కనపరిచినందుకు ఏపీకి ర్యాంకులు ప్రకటించింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ తాజా ర్యాకింగ్స్ లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీకి చోటు దక్కింది.

2020-21 సంవత్సరానికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ లో 72 స్కోర్ తో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. 2020లో ఏపీకి 67 పాయింట్లు రాగా, ఈసారి 5 పాయింట్లు అధికంగా సాధించింది. 75 స్కోర్ తో తొలి స్థానంలో కేరళ నిలవగా క్లీన్ ఎనర్జీ విభాగంలో ఏపీకి టాప్ ర్యాంక్ లభించింది. ఓవరాల్గా ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల జాబితాలో ఏపీ నిలిచింది.

2018 తో పోలిస్తే గణనీయంగా ఆంధ్రప్రదేశ్ పనితీరు మెరుగుపడింది. స్థిర ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రానికి జాతీయస్థాయిలో 3వ ర్యాంకు దక్కింది. ఈ జాబితాలో కేరళ అగ్రస్థానాన్ని నిల‌వ‌గా, రెండో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ఉంది. సిక్కిం, మహారాష్ట్ర వరుసగా 4, 5వ ర్యాంకుల్లో నిలిచాయి. ఇక అధ్వాన పనితీరు కనబర్చిన రాష్ట్రాలుగా బీహార్, జార్ఖండ్, అసోం అపఖ్యాతి మూటగట్టుకున్నాయి. జాబితాలో ఇవి చిట్టచివర నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్ అగ్రస్థానం నిలుపుకోగా, ఢిల్లీ రెండోస్థానం దక్కించుకుంది.