iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టన నాటి నుండి కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీ అనే భేధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తూన్నారు. ఆఖరికి కరోనా లాంటి మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించి ఆర్ధిక వ్యవస్థని కూల్చినా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక పక్క ఆ మహమ్మారిని ఎదుర్కుంటూనే మరో పక్క ప్రజలకు అందించాల్సిన సంక్షేమాన్ని మాత్రం వీడలేదు. ఇక తాజాగా సీఏం జగన్ పాలనాదక్షతకు నిదర్శనంగా సీ-ఒటర్ ప్రకటించిన సర్వేలో దేశంలో అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో 3వ స్థానంలో నిలిచి తొలిసారి రాష్ట్రాన్ని పాలిస్తున్నా ఒడిదుడుకులని సమర్దవంతంగా ఎదుర్కుని ప్రజా నేతగా పేరు తెచ్చుకున్నారు.
ప్రభుత్వ పనితీరు ఈ విధంగా ఉంటే ఇక తమకు రాజకీయంగా తీవ్ర నష్టం అని భావించిన ప్రతిపక్షాలు సీఎం జగనే టార్గెట్ గా మత రాజకీయాలకు తెరలేపారు. జగన్ ఏ సంక్షేమ పధకం ప్రజలకు అందించినా సరిగ్గా దానికి రెండు రోజులు అటో ఇటో రాష్ట్రంలో ఏదో ఒక మారుమూల దేవాలయాలపై దాడులు చేయడమో లేక గతంలో జరిగిన వాటిని తీసుకుని వచ్చి ఆ రోజే జరిగినట్టు ప్రచారం చేయడమో చేసి ప్రజల్లో జగన్ ప్రవేశ పెట్టిన పధకానికి వచ్చే మైలేజ్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు అమలు చేస్తున్న కుట్రను గమనించిన ప్రభుత్వం జరుగుతున్న దాడుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని పోలీసులని రంగంలోకి దింపింది. పోలీసులు చేసిన దర్యాప్తులో ప్రభుత్వం అనుమానించినట్టే దేవాలయాల దాడుల వ్యవహారం వెనక తెలుగుదేశం తో పాటు బీజేపీలో కొంతమంది పాత్రకూడా ఉన్నట్టు తేలింది. ఈ మేరకు నిందితుల పేరులతో సహా డీజీపి గౌతం సవాంగ్ మీడియా ముఖంగా ప్రకటించారు.
ఈ వ్యవహారంలో మొదటినుండి అనుమానిస్తునట్టు తెలుగుదేశం తో పాటు రెండు మూడు సంఘటలకు సంభందించి చేసిన దుష్ప్రచారంలో బీజేపీ కేడర్ కూడా ఉన్నటు రాష్ట్ర డీజీపి గారు ఆధారాలతో సహా బయటపెట్టడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డీజీపీ పై చిందులు తొక్కారు. ఈ మేరకు ఆయనను వివరణ కోరుతూ ఘాటుగా లేఖ కూడా రాసారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని డీజీపీ అనుకుంటున్నారా అంటు నేరంలో మతాన్ని మిళితం చేసే ప్రయత్నం చేశారు. డీజీపీ గారిని బెదిరించే ధోరణిలో ఊగిపోయారు. ఎప్పుడో తిత్లీ తుఫాన్ లో దేవుని విగ్రహం ధ్వంశం అయిన విషయం తెలియక సోషల్ మీడియా లో తమ పార్టీ మనిషి పెడితే దానికే కేసు పెడతారా అంటు నేరానికి కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు.
బీజేపీకి సంభందించిన మండల సెక్రటరీగా ఉన్న కోంచాడ రవి కుమార్ అనే వ్యక్తి సోంపేట గ్రామంలో తీత్లీ తుఫాన్ సమయంలో చెట్టుకొమ్మ పడి భూలోక మాత గుడిలో ఉన్న దేవుని విగ్రహం పాక్షికంగా ధ్వంసం అయితే, ఊద్దేశ పూర్వకంగా దానిని ఫోటో తీసి ఈ ప్రభుత్వములో దేవుడి విగ్రహం పై దాడి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అది జాతీయ స్థాయిలో వైరల్ అయి పోలీసులు రాగా ఉద్దేశ పూర్వకంగా చేసినట్టు తెలియడం దానికి సదరు వ్యక్తి క్షమాపణ కోరడం కూడా జరిగింది. అయితే ఇది భారతీయ శిక్షా సృతి ప్రకారం నేరమే. ఇదే రాష్ట్ర డీజీపి మీడియా ముఖంగా చెప్పారు. అయితే సోము వీర్రాజు గారు మాత్రం నేరాన్ని చిన్నా పెద్దా అంటు సైజుల వారీగా చూస్తూ డీజీపి గారిపై బెదిరింపు దోరణికి దిగి మతవిద్వేష రాజకీయానికి వంతపాడారు.అక్కడితో ఆగకుండా ఏకంగా అభూత కల్పనలు , అర్ధసత్యాలు ప్రచారం చేయడానికి ప్రెస్ మీట్ ని వేదిక గా మార్చుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చర్చీల నిర్మాణానికి ఫండ్ ఇస్తుందని , పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారని , రధాన్ని దగ్దం చేస్తే కేసు పెట్టరని , దళిత క్రీష్టియన్ అనే మాటే రాజ్యంగ విరుద్దం అని అసందర్భమైన తన హిందు పార్టీ ఎజండా అంతా ఏకరువు పెట్టారు.
జగన్ ప్రభుత్వం 29,841 మంది పాస్టర్లకే కాదు 13,646 మంది ఇమామ్‌లు, మౌజన్‌లకు 33,803 మంది అర్చకులకు కలిపి మొత్తం 77,290 మందికి కరోనా సమయంలో 5వేల ఆర్ధిక సాయం అందించిందన్న విషయాన్ని వీర్రాజు ఉద్దేశ పూర్వకంగా దాచారా లేదా అనేది చెప్పాలి. ఇక చర్చీల నిర్మాణానికి వస్తే బీజేపీ ప్రభుత్వం “స్వచ్ దర్శన్” పేరున మేఘాలయా ఎన్నికల ముందు ఆ ప్రాంతంలో చర్చీల టూరిజం అభివృద్దికి నిధులు ఎందుకు ఇచ్చిందో చెప్పాలి . అలాగే నాగాలాండ్ లో క్రైస్తవులకి జరుసలేం యాత్రకి నిధులు కేటాయిస్తాం అని బీజేపీ ఎలా ప్రకటించిందో, క్రైస్తవ మతం పై ఈశాన్య రాష్ట్రాలో ఒకలా మిగతా చోట ఇంకోలా ఈ ద్వంద వైఖరి ఎంటో చెప్పాలి.
ఇక రధం దగ్దం కేసు విషయానికి వస్తే అంతర్వేది ఘటనపై 2020 సెప్టెంబర్ 11న సీబీఐ దర్యాప్తు చేయమని ప్రభుత్వం జీఓ ఇచ్చింది మరి, నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ వేయలేదు? కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో వీర్రాజు చెప్పాలి. దళిత క్రీస్టియన్ అనే మాట రాజ్యాంగ విరుద్దం అని ఒక అసంధర్భ మాట మాట్లాడారు, సరే మరి అది రాజ్యాంగ విరుద్దం అని తెలిసి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మ్యానిఫెస్టోలో దళిత క్రైస్తువులని ఎస్సీల్లో చేరుస్తాం అంటే ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో వివరించాల్సిన నైతిక భాద్యత సోము వీర్రాజు గారిపై ఉంది. బీజేపీ పార్టీ మతం ముసుగులో ద్వంద వైఖిరి ప్రదర్శించడమే కాకుండా దేవాలయాలపై వారి స్థానిక నాయకులు చేస్తున్న విషప్రచారన్ని ఖండించాల్సింది పోయి ఇలా డీజీపిని టార్గెట్ చేసి మాట్లాడటం శోచనీయం.
నిజానికి బీజేపికి చెందిన వ్యక్తి మాణిఖ్యాలరావు దేవాదయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కన్నా నేడు జగన్ ప్రభుత్వం హిందూ దేవాలయాలకి ఎక్కువ నిధులు ఖర్చుపెడుతున్నది అనేది కాదనలేని సత్యం. దేవాలయాల అభివృద్ధికి బీజేపి వ్యక్తి మాణిఖ్యాలరావు హయాములో 5ఏళ్ళలో 150 కోట్లు ఖర్చు పెడితే జగన్ సీఎం అయినాక ఒకటిన్నర సంవత్సరంలోనే 168 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిధులు రూ.70 కోట్లు కనకదుర్గమ్మ దేవాలయానికి కేటాయింపులు జరిగాయి. బీజేపీ పాలన రాష్ట్రాల్లో కూడా లేని విధంగా గుడికో గోమాత కార్యక్రమం చేస్తున్నారు .
సంక్రాతి కనుమ పండుగనాడు సుమారు 2500 దేవాలయాల్లో గోమాతకు పూజ చేసే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం బీజేపీ హయాంలో కూల్చిన దేవాలయాలని జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పునర్నిర్మిస్తున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గిరిజన, దళిత, బలహీన వర్గాల, మత్స్యకార గ్రామాల్లోని కాలనీలను ఎంచుకుని సుమారు 500 ఆలయాలను నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ అర్చకులకు వంశపారంపర్యం హక్కులను కల్పించారు. తిరుమల లోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యెక్క గర్బగుడి తలుపులు సన్నిది గొల్లలు(యాదవులు) చేత తెరిపించి మొదటి దర్శనం చేసుకునే సంప్రదాయం తిరిగి పునరుద్ధరిస్తాం అని ఎన్నికల హామీ ఇచ్చిన విదంగానే అధికారంలోని రాగానే ఆ హామీని నిలబెట్టుకుంటూ వారికి హక్కులు కల్పించారు. ఇలా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది.
జగన్ ని హిందు వ్యతిరేకి అనే ముద్ర వేయాలనే తొందరలో సోము వీర్రాజు రాష్ట్ర ప్రజల ముందు మరింత చులకనవుతున్నారు అనడంలో సందేహం లేదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు తిరుపతి ఎన్నికల కోసం బీజేపి హిందు ముసుగు వేసి రాష్ట్రంలో చేస్తున్న మతతత్వ అల్లరి గ్రహించలేని అంత అజ్ఞానులు కాదని సోము వీర్రాజు గ్రహించాలి. దేవతా మూర్తులు ధ్వంసం అంటు అసత్యప్రచారాలు చేసిన నేరస్తులు మీ పార్టీ వారైనా నేరస్తులుగానే పరిగణించి హుందాగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షిస్తారని వీర్రాజు గ్రహించాలి..