iDreamPost
iDreamPost
మత్స్యకారుల సమగ్ర అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది. వారి సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఆ రంగం అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తోంది.
వైఎస్సార్ మత్స్యకార భరోసా..
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా రూ.10 వేలు సాయం అందించడానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద 2019 నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడేళ్లు 1,19,875 మత్స్యకార కుటుంబాలకు రూ.332 కోట్ల లబ్ధి చేకూర్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వేట నిషేధ సమయంలో కేవలం రూ. 4 వేల చొప్పున మత్స్యకార భృతి ఇచ్చేవారు. అదీ అర్హత ఉన్న అందరికీ కాకుండా బకాయిలు పెడుతూ అరకొరగా చెల్లించేవారు. ఈ భృతి సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏటా మత్స్యకారులు ఆందోళనలు చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వేట నిషేధ సమయంలోనే ఏటా కుటుంబానికి రూ.10 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోంది.
డీజిల్ పై సబ్సిడీ..
మత్స్యకారులు వేటకు ఉపయోగించే బోట్లకు వాడే డీజిల్ ను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. గతంలో లీటరుకు రూ.6.03 ఉన్న సబ్సిడీని రూ.9.00కి పెంచింది. డీజిల్ పోయించుకొనె సమయంలోనే రేటు తగ్గించి పోసే ఏర్పాటు చేసింది. వేట చేస్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే నష్ట పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది.
Also Read : Jagananna Thodu Launch – చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్..
ఆక్వా రైతులకు యూనిట్ కరెంట్ కేవలం రూ.1.50కే అందజేస్తోంది. ఇందుకోసం ఏడాదికి రూ.750 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటి వరకు 53,550 మంది ఆక్వా రైతులకు రూ.1,560 కోట్లను విద్యుత్ సబ్సిడీగా ప్రభుత్వం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.50.30 కోట్ల వ్యయంతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ లను ఏర్పాటు చేసి నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను వినియోగదారులకు అందించడానికి చర్యలు తీసుకుంది.
నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి చర్యలు..
దాదాపు రూ.1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వలదినె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు రూ.1,365.35 కోట్లు ఖర్చు చేయడానికి సిద్దపడింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ హార్బర్ల ద్వారా దాదాపు 85 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా.
మత్స్యకారుల సంక్షేమానికి రూ.2 వేల కోట్లకు పైగా వ్యయం..
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు మత్స్యకారుల సంక్షేమానికి రూ. 2,030 కోట్లను ఖర్చు చేసింది. వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రణాళికా యుతంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోంది. ఈ పథకాలకు సంబంధించి సహాయం, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబరును కూడా ఏర్పాటు చేసింది. తమ అభ్యున్నతికి ప్రభుత్వం బహుముఖంగా చర్యలు తీసుకొని, చిత్తశుద్ధితో అమలు చేస్తుండడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : YSR Vahana Mitra – పన్నుల భారం తీరింది.. బతుకు బండికి భరోసా దొరికింది..