వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు బాగా తగ్గాయని, పది వేల నుంచి 753కు కొత్త కేసుల నమోదు సంఖ్య తగ్గిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, రాజ్యాంగపరమైన అవసరాల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులేమీ లేవన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయని, తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైందని నిమ్మగడ్డ గుర్తు చేశారు.
ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం, రాజకీయ పక్షాలు, అధికారులు ఎన్నికలకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ఎప్పటికప్పడు ఆరోగ్యశాఖతో సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ ఆ ప్రకటనలో వివరించారు.
Read Also : ఆగిన చోట నుంచే స్థానిక పోరు.. సుప్రింలో ఎన్నికల సంఘం వాదనతో సుష్పష్టం