Idream media
Idream media
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకే ఈ చర్యలు తీసుకున్నామని ఎస్‌ఈసీ తన సిఫార్సుల్లో పేర్కొన్నారు. మీడియాతో కూడా మాట్లాడనీయొద్దంటూ అందులో పేర్కొన్నారు.
చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలైన పంచాయతీలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలపై శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ తీరును తూర్పారబట్టారు. నిమ్మగడ్డ ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఎస్‌ఈసీ ఆదేశాలను పాటించాలనే ఆలోచనతో నిబంధనలకు విరుద్ధంగా రిటర్నింగ్ అధికారులు వ్యవహరించొద్దన్నారు. పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలకు సిఫార్సులు చేస్తున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది.
రాష్ట్ర మంత్రిని నియంత్రిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికల సంఘానికి.. అధికారులతోపాటు ప్రభుత్వంలోని వారిపై కూడా చర్యలు తీసుకునే అధికారం ఉందా..? లేదా..? అని ఆలోచించే నిమ్మగడ్డ ఈ ఆదేశాలు జారీ చేశారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారులతోపాటు రాజకీయ నాయకులను కూడా నియంత్రించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భావిస్తున్నారు. ఇటీవల మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యానారాయణలు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. వారిని నియంత్రించాలని కోరుతూ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తప్పించాలని కూడా గవర్నర్‌ను కోరడం నిమ్మగడ్డ వ్యవహార శైలికి నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డిని ఎన్నికలు ముగిసే వరకు ఇంట్లోనే నిర్భందించాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమవుతోంది.
ఆర్టికల్ 243కే ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నానని ఎస్‌ఈసీ తన సిఫార్సుల్లో పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ద్వారా రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నవారు, మంత్రులపై చర్యలు తీసుకునే అధికారం ఎస్‌ఈసీకి ఉందా..? అంటే లేదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటిది నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకున్నారనేదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఎన్నికల్లో అనవసరమైన గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైకోర్టుకు ప్రభుత్వం..?
మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ రోజు, రేపు ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో.. హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.