తమ ఇళ్ల వద్దకే వచ్చి ప్రభుత్వ సేవలు, పధకాలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమ కృతజ్ఞతను చాటుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏడాది అయిన తరుణంలో ప్రభుత్వ సేవలలో విప్లవాత్మక మార్పులకు సాక్షులుగా నిలిచిన సిబ్బందికి చప్పట్ల ద్వారా అభినందనలు తెలపాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు ఏపీ ప్రజలు విశేషంగా స్పందించారు.
కాలు బయటపెట్టకుండా, ఏ నాయకుడి ఇంటి చుట్టూ ప్రదక్షణ చేయకుండా, ఎవరికీ లంచాలు ఇచ్చే పని లేకుండా రేషన్ కార్డు, పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు, సంక్షేమ పథకాలను తమకు అందిస్తున్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పట్ట ప్రజలు తమ కృతజ్ఞతను చాటుకున్నారు. రాత్రి ఏడు గంటలకు ఇళ్ల బయటకు వచ్చి చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. పట్టణ, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సీఎస్ నీలం సాహ్ని, మంత్రి బొత్స సత్యనారాయణలతో కలసి చప్పట్లు కొట్టి అత్యున్నతమైన సేవలు అందిస్తున్న సచివాలయ సిబ్బందికి అమూల్యమైన గౌరవం ఇచ్చారు.