iDreamPost
android-app
ios-app

ఇవ్వడం మాత్రం పక్కా

  • Published Aug 14, 2020 | 4:37 PM Updated Updated Aug 14, 2020 | 4:37 PM
ఇవ్వడం మాత్రం పక్కా

గోపాల గోపాల సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ ఒకటుంటుంది.. ‘మిత్రమా కొన్ని సార్లు రావడం ఆలస్యం అవుతుందేమోగానీ.. రావడం మాత్రం పక్కా’ అని. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ళ స్థలాల పంపిణీ విషయంలో ఈ డైలాగ్‌ను పక్కాగా అన్వయించుకోవచ్చు.

దాదాపు ముప్పైలక్షల మంది పేదలకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసేందుకు సీయం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. వీటిని ఉగాదికి పంపిణీ చేయాలని తలచినప్పటికీ అనేకానేక కారణాలతో ఇప్పటి వరకు నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. కోర్టు కోసులు, కరోనా తదితర కారణాలతో పట్టాల పంపిణీ ఆలస్యం అవుతోంది. అయితే కొన్ని చోట్ల ఉన్న కేసుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ పట్టాల పంపిణీ ఆలస్యం కావడం పేదల వైపునుంచి ఇబ్బందికరమైనదే.

ఎటువంటి కోర్టు ఇబ్బందుల్లేకుండా పేదలందరికీ ఒకేసారి పట్టాలను పంపిణీ చేయాలన్న తలంపులో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ పార్టీ నాయకులు ఘంటాపథంగా ఒకే మాట చెబుతన్నారు. పట్టాలు ఇవ్వడం ఆలస్యం ఆవొచ్చేమోగానీ, ఇవ్వడం మాత్రం పక్కా.. అంటూ కాస్తంత గట్టిగానే చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు పదిహేనేళ్ళుగా పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ జరగనేలేదని చెప్పాలి. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టాక పట్టాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే ఆయా మండలాల్లో లే ఔట్లు కూడా సిద్దమైపోయాయి. నిబంధనల మేరకు రోడ్లు, ఇతర మౌలిక వసతులతో వీటిని ఏర్పాటు చేసారు. అలాగే లే ఔట్‌లలో మొక్కలను నాటి అక్కడ పచ్చదనాన్ని కూడా పెంపొందించేందుకు నిర్ణయించారు. అయితే పదేపదే పట్టాల పంపిణీ వాయిదాపడడంతో కొంత నిరాశ చెందుతున్నప్పటికీ, పేదల విషయంలో తాము ఓపికతోనే వ్యవహరిస్తామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా పేదలకు పట్టాలతో పాటు ఇళ్ళు కూడా నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఏళ్ళ తరబడి నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా ఆధునిక టెక్నాలజీని ఇందుకోసం వినియోగించుకోవాలనుకుంటోంది. ఇన్‌ఫిల్‌ టెక్నాలజీ విధానంలో కేవలం 48 గంటల్లోనే పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా ఆధునిక టెక్నాలజీతో ఈ ఇళ్ళను నిర్మించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవం రూరల్‌ నియోజకవర్గంలోని కడియం మండలం జేగురుపాడు గ్రామంలో శుక్రవారం ఈ మేరకు సదరు మోడల్‌ హౌస్‌ను ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నట్లు రాజమహేంద్రవం ఎంపీ, వైఎస్సార్‌సీపీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌రామ్‌ తెలిపారు. రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆయన ఈ మోడల్‌ హౌస్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు.

సోలార్‌ రూఫింగ్, వెర్టికల్‌ గార్డెన్, విశాలవంతమైన గదులు, పర్యావరణ హితమైన మెటీరియల్‌ను ఈ ఇంటి నిర్మాణంలో వినియోగించన్నుట్లు ఎంపీ తెలిపారు. ఈ మోడల్‌ హౌస్‌ల నిర్మాణంలో వినియోగించే అత్యాధునికమైన విధానం ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ అతి తక్కువ సమయంలోనే ఇళ్ళను నిర్మించి ఇవ్వొచ్చని ఆయన చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటే పేదలకు ఇస్తామన్న స్థలం పట్టా, ఇల్లు కూడా నిర్ణీత సమయానికే అందించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.