Idream media
Idream media
ఏపీ అధికారిక వ్యవహారాల్లో ముఖ్యమంత్రి తన మార్క్ విధానాలను ముందుకు తెస్తున్నారు. పలు అనుమానాలు,కొందరి అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయన ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే గ్రామీణ పాలనా యంత్రాంగంలో సచివాలయాల ద్వారా సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ తాజాగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లోనూ తన దూకుడు కొనసాగిస్తున్నారు. దానికి అనుగుణంగానే విధానాలను రూపొందిస్తున్నారు. తాజాగా క్యాబినెట్ సమావేశంలో కొందరు మంత్రులు చేసిన ప్రతిపాదనలు కూడా పక్కన పెట్టి పారదర్శకంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలు సాగించాలని సీఎం సూచించడం చర్చనీయాంశం అవుతోంది.
అవుట్ సోర్సింగ్ నియామకాలను నేరుగా ప్రభుత్వమే నిర్వహించడానికి నిర్ణయించారు. ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. గతంలో కొన్ని ఏజన్సీల ద్వారా సాగిన నియామకాల విషయంలో జరిగిన భారీ అవినీతిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో కనీసం నిబంధనలు కూడా పాటించకుండా పలు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.పైగా ఈ నియామకాల ప్రక్రియలో కనీస అర్హతలు కూడా లేని సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ వ్యవహారం అడ్డగోలుగా సాగిందనే విమర్శలున్నాయి.
ప్రస్తుతం నేరుగా ప్రభుత్వమే నియామకాలు చేపట్టడం, అందులో రిజర్వేషన్లు పాటించడం, మహిళలకు 50శాతం ప్రాధాన్యతనివ్వడం వంటి నిర్ణయాల నేపథ్యంలో తొలుత అవుట్ సోర్సింగ్ నియామకాల్లో జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖ మంత్రి ఆమోదముద్ర వేస్తారని సీఎం ప్రకటించారు. కానీ దాని కారణంగా రాజకీయ ప్రాధాన్యతలు ముందుకొచ్చి, అర్హులకు అవకాశం దక్కదనే సందేహాలు వ్యక్తం కావడంతో సీఎం మనసు మార్చుకున్నారు.మరింత పారదర్శకత అవసరం అని భావిస్తున్న నేపథ్యంలో నేరుగా జిల్లా కలెక్టర్లు, శాఖ కార్యదర్శులు తుది నిర్ణయం తీసుకునేలా మార్పులు తీసుకొచ్చారు. వైసీపీ కార్యకర్తలకు అవుట్ సోర్సింగ్ లో ప్రాధాన్యత ఇద్దామని, పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చినట్టవుతుందని కొందరు మంత్రులు సూచించినప్పటికీ సీఎం సున్నితంగా తిరస్కరించడమే కాకుండా, దాని వల్ల వచ్చే ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా పదుల సంఖ్యలో ఇచ్చే పోస్టుల్లో కొందరు కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం ద్వారా మిగిలిన వారిలో అసంతృప్తి రాజుకోవడమ కాకుండా, అర్హులను దూరం పెట్టడం ద్వారా అనవసర అపోహలు, అక్రమాలు జరిగాయని ప్రత్యర్థులు ప్రచారం చేయడానికి అవకాశం ఇచ్చినట్టవుతుందని సీఎం చెప్పడంతో మంత్రివర్గం అంగీకరించినట్టు తెలిసింది. దాంతో ఏపీలో ఈసారి అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలను మరింత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలనే లక్ష్యంతో సీఎం పట్టుదలగా ఉన్న తరుణంలో పలువురి అర్హులకు ఛాన్స్ వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.