iDreamPost
iDreamPost
ఇప్పటికే విన్నూత్న పథకాలతో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. రివర్స్ టెండరింగ్ వంటి ప్రక్రియ ద్వారా కాంట్రాక్టులలో అవినీతికి అడ్డుకట్ట వేసి ఆదర్శంగా నిలిచారు. ఇక నియామకాల విషయంలో కూడా అదే నిబద్ధత చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల పేరుతో సాగుతున్న దందాకు అడ్డుకట్ట వేసేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉండేందుకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే ఓ అరుదైన విషయంగా అంతా భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 47వేల మందికి నియామకపత్రాలు అందించబోతున్నారు. ఆప్కాస్ పేరుతో ఏర్పాటు చేసిన కార్పోరేషన్ ద్వారా ప్రభుత్వమే నియామక ఉత్తర్వులు అందిస్తున్న నేపథ్యంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఊరట లభిస్తున్నట్టుగా భావిస్తున్నారు.
గతంలో విపక్ష నేతగా వైఎస్ జగన్ ఈమేరకు హామీ ఇచ్చారు. దానిని ఇప్పుడు ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్’ (ఆప్కాస్) పేరుతో అమలు చేస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగాలు పొందుతున్న వారితో మాట్లాడతారు. ఈ సందర్భంగా సీఎం 47 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించబోతున్నారు. లాభాపేక్ష లేకుండా ఈ కార్పొరేషన్ పని చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇది నూటికి 100 % రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అని ప్రకటించింది. దాంతో ఇక అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భ్రదతకు ఆస్కారం ఉంటుందని ఆశిస్తున్నారు.
ఇప్పటికే వివిధ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందిని కార్పొరేషన్ పరిధిలోకి మార్చారు. ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఆప్కాస్ మాత్రమే ప్లేస్‌మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఉన్న సిబ్బంది ఎవరినీ తొలగించేది లేదని ప్రకటించారు. అంతేగాకుండా నియామక పత్రాల జారీ విషయంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రక్రియ అంతా సజావుగా సాగేలా యునిక్ కోడ్ జారీ చేస్తున్నారు. అంతేగాకుండా రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తారు. 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించబోతున్నారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు, మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. వాటన్నింటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి. .
కార్పొరేషన్ పరిధిలోకి ఆయా ఉద్యోగులను బదలాయించే సమయంలో పే స్లిప్‌లు, బ్యాంక్ ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి సంబంధించిన ఖాతాల వివరాలు సేకరిస్తారు. తద్వారా అన్నీ సక్రమంగా అమలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆప్కాస్‌కు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపు తర్వాత వారి వేతనాలన్నీ ఆ కార్పొరేషన్ ద్వారానే చెల్లిస్తారు. ఆయా శాఖలు, విభాగాలు సంస్థలు, కార్యాలయాలు నేరుగా వేతనాలు చెల్లించవు. దానిద్వారా సకాలంలో వేతనాలు దక్కడానికి, ఎటువంటి అక్రమ వసూళ్లకు అవకాశం ఉండదని భావిస్తున్నారు.
ఇప్పటి వరకూ వివిధ ఏజన్సీలు ముఖ్యంగా అధికార పార్టీల నేతల పేరుతో సాగుతున్న ప్రక్రియకు పూర్తిగా ముగింపు పలికినట్టు అవుతుందని కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అసోసియేషన్ కూడా చెబుతోంది. ఇచ్చిన హామీ అమలు పరుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయానికి వారంతా ధన్యవాదాలు చెబుతున్నారు.