iDreamPost
android-app
ios-app

ప్రతిపక్షాలు అచేతనమైపోవటం ఇదే మొదటిసారేమో ?

  • Published May 13, 2020 | 3:26 AM Updated Updated May 13, 2020 | 3:26 AM
ప్రతిపక్షాలు అచేతనమైపోవటం  ఇదే మొదటిసారేమో ?

రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్షాలు అచేతనమైపోవటం బహుశా ఇదే మొదటిసారేమో. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఒకేసారి కుదేలైపోయాయి. పెద్ద గాలివానకు చిన్న చిన్న పూరిళ్ళన్నీ కొట్టుకుపోయినట్లుగా అయిపోయింది పార్టీల పరిస్ధితి. గుడ్డిలో మెల్లలాగ తెలుగుదేశంపార్టీ మాత్రం 23 సీట్లతో బతికి బట్టకట్టింది. లేకపోతే రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉనికే లేకుండా పోయేదేనటంలో సందేహమే లేదు.

ఎప్పుడో 1982కు ముందు ఉమ్మడి ఏపిలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలిచే ప్రత్యర్ధే కనబడలేదు. అలాంటిది ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీని ఏర్పాటు చేయటం, ఎన్నికల్లో సంచలన విషయం సాధించటంతో రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలైందనే చెప్పాలి. 1982 నుండి ప్రతి ఎన్నికకు ఓ పార్టీ అధికారంలో నుండి మారుతునే ఉంది. సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతిపక్షం మాత్రం బలంగానే ఉండేది. చివరకు 1995లో ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారాన్ని హస్తగతం చేసుకునేంత వరకూ రాజకీయాలు పద్దతిగానే నడిచాయి.

వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1999లో కూడా గెలిచాడు. చివరకు 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దెబ్బకు చంద్రబాబు మట్టి కరిచాడు. 2009 లో కూడా పార్టీని రెండోసారి ఎన్నికల్లో గెలిపించిన చరిత్ర కాంగ్రెస్ నేతల్లో వైఎస్సార్ కే దక్కుతుంది. అప్పటి వరకూ అధికారంలో ఎవరున్నా ప్రధాన ప్రతిపక్షం కూడా బలంగానే ఉండేది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర విభజన జరగటం 2014 ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు సిఎం అవ్వటంతో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి బలమైన ప్రతిపక్షంగా ఉండేది.

2014-19 మధ్య చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఆధ్వర్యంలో వైసిపి ఎంఎల్ఏలు, నేతలు గట్టిగానే పోరాటాలు చేశారు. జగన్ ను తట్టుకోలేకే చివరకు వైసిపి ఎంఎల్ఏలను లాక్కున్నాడు. అయినా ఉన్న ఎంఎల్ఏలతోనే పోరాటం చేశాడు. చివరకు పాదయాత్ర మొదలు పెట్టటంతో టిడిపి పతనం మొదలైంది. సరే 2019 ఎన్నికల్లో వైసిపి గాలి ఎంత ఉధృతంగా వీచిందో అందరు చూసిందే.

వైసిపి గాలికి టిడిపిలోని మహామహులనుకునే ఎంతోమంది సీనియర్ నేతలు గాలికి కొట్టుకుపోయారు. టిడిపి పరిస్ధితే ఇలాగుంటే ఇక బిజెపి, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ పరిస్ధితి గురించి చెప్పేదేముంది ? టిడిపి మినహా నాలుగు ప్రతిపక్షాల తరపున పోటి చేసిన వాళ్ళల్లో కేవలం ఒకే ఒక్క అభ్యర్ధి రాపాక వరప్రసాద్ రాజోలు నుండి జనసేన అభ్యర్ధిగా గెలిచాడంటేనే జగన్ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో అర్ధమైపోతోంది.

కేవలం జగన్ దెబ్బ కారణంగానే మళ్ళీ 1982 నాటి పరిస్ధితులు మొదలైందా అనే సందేహం మొదలైంది జనాల్లో. అంటే రాష్ట్రంలో జగన్ ను గట్టిగా ఎదిరించి నిలిచే ప్రతిపక్షం లేదనే చెప్పాలి. చంద్రబాబు అధినేతగా ఉన్నాడు కాబట్టే, ఎల్లోమీడియా జాకీలేసి లేపుతోంది కాబట్టే టిడిపి పరిస్ధితి గాలిలో దీపంలాగ ఇంకా కొట్టుకుంటోంది. లేకపోతే ఏపిలో ప్రతిపక్షమన్నదే ఉందేడి కాదు. చూడబోతే ప్రతిపక్షాలన్నీ అచేతనమైపోవటం బహుశా ఇదే మొదటిసారేమో అనిపిస్తోంది.