ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీలను సెలవులుగా ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే తేదీలయిన ఫిబ్రవరి 9, 13, 17, 21న స్థానిక సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే రోజుల్లో ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988 ప్రకారం వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తొమ్మిది జీవోలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వేర్వేరుగా జారీ చేశారు.
రాష్ట్రంలో జరిగే పంచాయితీ ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికల ఏజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదని వేర్వేరుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే 44 గంటల ముందు నుండి మద్యం షాపులు మూసి వేయాలని మరో ఉత్తర్వు ఇచ్చారు. పోలింగ్ బాక్సులతో పాటు సిబ్బందిని కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉన్నందున అందుకు అవసరమైన వాహనాలను వివిధ ప్రభుత్వ శాఖల నుండి తీసుకుని వినియోగించేలా కలెక్టర్లు చర్యలు తీసుకునేలా అధికారాలు ఇచ్చారు. పోలీసు, అగ్నిమాపక, ట్రాన్స్‌కో, జెన్‌కో, యూనిసెఫ్ ఇచ్చిన వాహనాలు, ట్రైనింగ్ కళాశాలల వాహనాలు, ఆర్‌డబ్ల్యూఎస్ వాహనాలను ఎన్నికల నిర్వహణలో వినియోగించాలని సీఎస్ ఆదిత్యనాధ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.