Idream media
Idream media
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 వేల క్యూసెక్కుల నీళ్లు తోడేందుకు చంద్రబాబు అనుకూలమా..? వ్యతిరేకమా..? వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బంగడుపుకునే నాయకుడు చంద్రబాబని అనిల్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో మాదిరిగా.. ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో రాష్ట్రంలోని జిల్లాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏడాదిన్నర క్రితం ప్రతిపాదించామని, మధ్యలో నాలుగు అసెంబ్లీ సెసెన్స్ జరిగినా.. అప్పుడు మాట్లాడని టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వాదాన్ని సమర్థించేందుకే చంద్రబాబు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని మంత్రి అనిల్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖపై, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును మీడియా సమావేశంలో మంత్రి అనిల్ ఎండగట్టారు. ప్రెస్‌మీట్ వివరాలు ఆయన మాటల్లో..
‘‘ రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ వైపు ఒకలా, ఏపీ వైపు మరోలా మాట్లాడారు. ఈ రోజు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఎప్పుడూ కూడా ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపునే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ప్రకాశం జిల్లా శాసన సభ్యులు రాసిన లేఖ ఇందుకు నిదర్శం. రాయలసీమ లిఫ్ట్‌ను ఆపేయండి.. 80 వేలు క్యూసెక్కులు తోడద్దని రాశారు.
వైఎస్సార్ కుటుంబం ఎప్పుడు ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా.. ప్రతి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ బాగుండాలని చేసింది. 9 ఏళ్లు పని చేసినా.. తాను కట్టానని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఒక్క ప్రాజెక్టు లేదు. రాయలసీమలో, కోస్తాలో పోలవరం ప్రాజెక్టు, శ్రీకాకుళంలో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణలో ఇప్పుడు కాళేశ్వరం అని చెప్పుకుంటున్న ప్రాణహిత – చేవెళ్ల.. అన్ని ప్రాంత్రాల అభివృద్ధికి వైఎస్సార్ పని చేశారు. తన తండ్రి మాదిరిగానే అన్ని ప్రాంతాలు బాగుండాలని వైఎస్ జగన్ పని చేస్తున్నారు.
జిల్లాల మధ్య చిచ్చుపెట్టే నీచమైన పని చంద్రబాబు చేస్తున్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు రాజశేఖరరెడ్డి ఏం చేశారు..? చంద్రబాబు ఏం చేశారనేది ఆ లేఖ రాసిన ఎమ్మెల్యేలు గుర్తుచేసుకోవాలి. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే.. 4 వేల కోట్ల రూపాయలతో ఎన్‌ఎస్‌పీ ఆధునీకికరణ జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించి, పూర్తి చేశారు. కొరిశపాడు లిఫ్ట్, సోమశిల నుంచి రాళ్లపాడుకు వెళ్లే కాలువ సామర్థ్యం పెంచారు.
Also Read : రాజీ పడింది.. హక్కులు వదులుకుంది ఎవరు సోమిరెడ్డి..?
వైఎస్సార్ ప్రభుత్వం వెలిగొండ పనులు ప్రారంభించింది. మొదటి టెన్నెల్ పనులు 11.5 కిలో మీటర్లు జరిగింది. బాబు హాయంలో నాలుగు కిలోమీటర్లు పని చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.8 కిలోమీటర్ల పనిని చేసి టెన్నెల్ పనిని పూర్తి చేసింది. బాబు దృష్టి పెట్టి ఉంటే రెండో టెన్నల్ పనులు పూర్తయ్యేయి. గతంలో రెండు కిలోమీటర్లు పని అయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కిలోమీటర్ పని పూర్తి చేశాం. 2023 నాటికి రెండో టెన్నెల్ పూర్తి చేస్తాం.
ప్రతి ప్రాంతానికి మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను పెట్టారు.ఎన్నికలకు మూడు నెలల ముందు గుంటూరు ఛానెల్ సహా పలు పథకాలకు టెంకాయ కొట్టి శిలాఫలకాలు వేసిన చరిత్ర చంద్రబాబుది. గోదావరి నుంచి నీళ్లు తీసుకువచ్చి.. ఎన్‌ఎస్‌పీకి నీళ్లు తరలిస్తున్నాం. ఇందుకు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రారంభించాం.
అసలు తెలుగుదేశం పార్టీ విధానం ఏమిటి..? తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలే.. టీడీపీ ఎమ్మెల్యేల నోటి నుంచి వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పోయి తెలంగాణదేశం పార్టీగా మారిపోయారు. దిండి, పాలమూరు రంగారెడ్డి 2015 మొదలు పెట్టారు, తుమ్మెళ్ల 2017 మొదలుపెట్టారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తర్వాత.. ఆ కేసుకు భయపడి హుటాహుటిన ఏపీకి వచ్చి, వారితో చంద్రబాబు రాజీపడిన తర్వాత ఈ ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. ఆ రోజు వారు ఆ ప్రాజెక్టులు కట్టే సమయంలో.. జగన్ ఈ నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో చేసిన ఆలోచన నాడు చంద్రబాబు చేసి ఉంటే ఈ రోజు మాట పడాల్సిన అవసరం ఉండేదా..?
ఒకప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకెళుతుంటే.. దేవినేని ఉమాను తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేయించారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూశారు. ఒక అంశంపై తెలంగాణలోని అన్ని పార్టీలు ఒకే మాటకు కట్టుబడి వస్తుంటే.. నీ ఛానెళ్లలో రాజకీయాలు చేస్తున్న మాట వాస్తవం కాదా..చంద్రబాబు..? నీ ఛానెళ్లలో తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న మాట వాస్తవం కాదా..? మీ ఎమ్మెల్యేలు తెలంగాణ వాదాన్ని వినిపిస్తుండడం వాస్తవం కాదా..?
గుంటూరు ఛానెల్‌ను పర్చూరు వరకూ పొడిగిస్తున్నాం. పల్నాడుకు సంబంధించి వరికపూడిశెల ఒక ఫేజ్ మొదలుపెట్టి వదిలేశారు.. మేము రెండో ఫేజ్‌కు కూడా టెండర్లు పూర్తి చేసి.. లక్ష ఎకరాలకు నీళ్లు అందించాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. సోమశిల నుంచి రాళ్లపాడుకు వెళ్లే కాలువ డబుల్ చేయాలని ప్రతిపాదనలు రూపొందించాం. తద్వారా ప్రకాశం జిల్లాకు మేలు జరుగుతుంది.
ఒక్క రిజర్వాయర్‌లేని కరువు జిల్లా చిత్తూరులో.. మూడు రిజర్వాయర్లు కడుతుంటే మీ పార్టీ నేతలతో ఎన్‌జీటీలో ఫిర్యాదు చేయించావ్. సొంత జిల్లా, పుట్టిన జిల్లా, నీకు రాజకీయ బిక్ష పెట్టిన జిల్లాలో మూడు రిజర్వాయర్లు జగన్ కడుతుంటే.. నువు చేయలేని పని జగన్ చేస్తున్నారని మనసొప్పక ఎన్‌జీటీలో కేసులు వేయించింది నిజం కాదా..? రెండు, మూడు ఛానెళ్లను పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ.. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నది ఎవరు..? రాజకీయాలు చేస్తున్నది ఎవరు..?
Also Read : చంద్రబాబు మరోసారి పవన్ తో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నాడా?
పదిహేను రోజుల నుంచి కొన్ని ఛానెళ్లు లేటరేట్ కాదు.. బాక్సైట్ అని చెబుతున్నాయి. ఒక సర్వే ప్రకారం అది బాక్సైట్ కాదు లేటరేట్ అని ఒప్పుకున్న ఈనాడుకు ధన్యవాదాలు. ఇతర ఛానెళ్లకు ఈ మాట రాసే మనసు కూడా రావడం లేదు. ఈ ప్రభుత్వం ఒక్క లేటరేట్ క్వారీకి అనుమతి ఇవ్వలేదు. కేవలం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మాత్రమే అమలు చేసింది. లేటరేట్ అనేది సిమెంట్ ఫ్యాక్టరీలలో వాడతారు. వాళ్లు చెప్పే అల్యూమినియం, బాక్సైట్ సిమెంట్ ఫ్యాక్టరీలలో వాడరు.
2014, 2015లో విశాఖ బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు ప్రభుత్వ హాయంలో పర్యావరణ అనుమతులు వచ్చింది వాస్తవం కాదా..? 2018లో కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అడ్డుకోలేదు. గిరిజనుల పేరు మీద మూడు అనుమతులు తీసుకుని నడిపిన వ్యక్తులు అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు కాదా..? వాళ్లపై విచారణ జరగాలి. వారిపై రాసే దమ్ము ధైర్యం లేదా..?
ఏ ప్రాంతంలోనైనా తన మార్క్‌ను వేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్సార్. నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్.. మఖ్యమంత్రి అయిన తర్వాత.. ప్రతి ప్రాంతం బాగుండాలని మనకు హక్కుగా వచ్చిన నీళ్లును వాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రాజెక్టులు కడుతుంటే.. దానికి సహకరించాల్సిందిపోయి, ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి.. తెలుగు జాతికి అండగా ఉండాల్సింది పోయి.. చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న నీచమైన, హేయమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు కాదా..? అసలు ఇలాంటి వ్యక్తి మనిషేనా..?
ఈ రాష్ట్రానికి చంద్రబాబు, రామోజీ రావు, రాధాకృష్ణ, బీవీనాయుడు రూపంలో నాలుగు దెయ్యాలు తయారయ్యాయి. మా వాళ్లు ముఖ్యమంత్రి కాకపోతే.. ఈ రాష్ట్ర అన్‌స్టేబుల్‌గా ఉంటుంది. మేము అడ్డమైన రాతలు రాస్తాం. చేష్టలు చేస్తాం. నీచంగా ఏమైనా రాస్తాం. అది మా హక్కు..మేం ఏం చేసినా చెల్లుతుందనేలా ప్రవర్తిస్తున్నారు.
Also Read : బాబు చేయాల్సినవి, చేయలేనివి జగన్ ను చేయమంటున్న తమ్ముళ్లు..!
ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాలని నిర్ణయించాం. ప్రతిపాదనలు, అనుమతులు, టెండర్లు పూర్తయి.. పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యలో నాలుగు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఒక్క సెసెన్స్‌లోనైనా టీడీపీ ఎమ్మెల్యేలు ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదు. ఈ రోజు తెలంగాణ వాదనకు వంత పాడుతున్నారు. ప్రకాశం జిల్లాకు ఎవరు మంచి చేశారో ఈ శాసన సభ్యులను అడుగుతున్నాను. మీ నేత ప్రకాశం జిల్లాకు ఏం చేశారు..?
ఈ రాష్ట్రాని వదిలి.. హైదరాబాద్‌లో దాక్కొని.. తెలుగుదేశం పార్టీని కాస్తా.. తెలంగాణ దేశం పార్టీగా మార్చి.. తెలంగాణకు వంత పాడడం ఎంత వరకు సమంజసం అని చంద్రబాబును అడుగుతున్నాను. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీరు కిందకు వదులుతుంటే.. ఇది కరెక్ట్ కాదు.. అని కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేకపోయిన ప్రతిపక్ష నేత ఉండడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం.
గత 2 ఏళ్లలో 800 టీఎంసీలు పోయాయి. మన వాటా నీటిని వాడుకునేందుకు ఈ ప్రాజెక్టులు కడుతున్నాం అని సీఎం జగన్ పలు వేదికల్లో చెప్పారు. ఇప్పటి వరకు మాట్లాడని చంద్రబాబు.. ఈ రోజు తెలంగాణ లేవనెత్తిన అంశాన్ని అడ్డుపెట్టుకుని తన ఛానెళ్ల ద్వారా జిల్లాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాడు. అన్ని ప్రాంతాలు కొట్టుకోవాలి, కత్తులు దూసుకోవాలనేదే చంద్రబాబు కోరిక. గతంలో అక్కడ తెలంగాణ జిందాబాద్, ఇక్కడ సమైక్యాంధ్ర జిందాబాద్ అని ఓడగొట్టేదాకా మాట్లాడారు. ఇప్పుడు రాయలసీమ, ప్రకాశం.. అంటూ రెచ్చగొడుతున్నారు. ఎన్‌జీటీలో కేసులు వేయిస్తున్నారు. ఎమ్మెల్యేల చేత మాట్లాడిస్తున్నారు.
అసలు చంద్రబాబు విధానం ఏమిటి..? రాయలసీమ లిఫ్ట్ 80 వేల క్యూసెక్కులు తీసుకెళ్లేదుకు నేను మద్ధతిస్తున్నానని చెప్పగలవా..? దీనికి నీవు ఒప్పుకుంటున్నావా..? లేదా..? బయటకు వచ్చి చెప్పు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని అక్రమంగా చేస్తోందని ఒక్కసారైనా మాట్లాడావా..? ఈ ఛానెళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. రోజుకో మాదిరిగా రాస్తున్నారు. గుస్సా అంటారు.. మిలాఖత్ అంటారు.
టీడీపీ స్టాండ్‌పై క్లారిటీ లేదు. దానిపై రాయరు. మాట్లాడరు. రాజశేఖరరెడ్డి అన్ని ప్రాంతాలకు మంచి చేసినట్లుగా.. తామూ చేయాలన్నదే మా విధానం.
గుండ్రేవుల ప్రాజెక్టు ఆగలేదు. అది మూడు రాష్ట్రాలకు సంబంధించినది. నేరడి బ్యారేజీలో నిర్మాణంలో 114 ఎకరాల భూమి సమస్య పరిష్కారం కాలేదు. ముందు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో వెళుతున్నాం.
కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకుని.. మాకు రావాల్సిన వాటాను ఇవ్వాలని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే.. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తాం. ఆగస్టు నాటికి 41 కాంటూరు మేరకు నిర్వాసితులకు పునరావాసం, ఆర్‌అండ్ ఆర్ ఇచ్చి తరలిస్తాం. ఈ నెల ఆరేడువేల మందికి ఇస్తాం. వచ్చే నెలలో మిగతా వారికి పరిహారం ఇస్తాం. నిధులు రీయంబర్స్ త్వరగా వచ్చేలా సోము వీర్రాజు గారు సహకారం అందించాల’’ని అనిల్ కుమార్ యాదవ్ కోరారు.
Also Read : రాయలసీమ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు ఎలా నష్టం..?