ఏపీ ముఖ్యమంత్రి భారీ లక్ష్యంతో సాగుతున్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించే భారీ ప్రాజెక్ట్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు.ఏకంగా 25లక్షల లక్ష్యం చేరాలనే పట్టుదలగా ఉన్నారు. దానికి అనుగుణంగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యింది. ఏడు జిల్లాల్లో అంతా సిద్దమయినట్టుగా తాజాగా మంత్రి ప్రకటించారు. దాంతో మిగిలిన జిల్లాల్లో కూడా వీలయినంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసే ఆలోచనలతో ప్రభుత్వం ఉంది. పేదలకు సుదీర్ఘకాలంగా కలగా ఉన్న వాటిని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
అర్హులైన వారందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించే భారీ ప్రాజెక్ట్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు. వచ్చే ఉగాదిని దానికి ముహూర్తంగా నిర్ణయించారు. దానికి సంబంధించిన ప్రాధమిక కసరత్తులు పూర్తయ్యాయి. రికార్డ్ స్థాయిలో, రాష్ట్ర చరిత్రలో ఒకేసారి 25లక్షల మందికి రిజిస్ట్రేషన్ తో పట్టా అందించే ప్రక్రియ కొత్త చరిత్రకు నాంది పలకబోతోంది. అందుకు తగ్గట్టుగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా పట్టణప్రాంతాల్లోని పేదలకు 2,58,648 గృహాలు మంజూరయినట్టు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు తెలిపారు. రూ.7042.5 కోట్లతో గృహనిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. అందులో 51,446 మంది ఎస్సీలు, 10,429 మంది ఎస్టీలు, 1.50,665 మంది బిసిలు, 19,683 మంది మైనార్టీలతో పాటుగా 46,108 మంది ఇతరులకు పక్కాగృహాల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో పదిలక్షల అర్బన్ హౌసింగ్ నిర్మాణం జరుగుతుందని వివరించారు.
వైసీపీ ఎన్నికల ముందు చెప్పిన రీతిలో నవరత్నాల్లో భాగంగా ఉగాదికి పట్టాలు పంపిణీ చేసి, రాబోయే నాలుగేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో సర్కారు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇప్పటికే పేదలకు ఇచ్చే భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. రెవెన్యూ మంత్రితో కలిసి ఏడు జిల్లాల్లో భూసేకరణ కోసం సమీక్షలు కూడా చేశామని అన్నారు. త్వరలోనే మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా పర్యటించి, భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మంత్రి చెరుకువాడ తెలిపారు. ప్రభుత్వ భూమి లభ్యత లేని చోట ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేస్తామని అన్నారు. దీనికి రెవెన్యూ రేటు నుంచి రెండున్నర రెట్ల వరకు చెల్లించి భూమిని కొనుగోలు చేస్తామని అన్నారు. అంతేకానీ రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం జరగదని వెల్లడించారు.
ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన మేరకు భూసేకరణ చేయడమే కాకుండా దానిని అభివృద్ది చేసి లబ్ధిదారులకు అందించేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికోసం కోసం సుమారు 11 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. గృహనిర్మాణ శాఖకు సంబంధించి గత ప్రభుత్వం నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లించిన నేపథ్యంలో దానికి భిన్నంగా పేదలకు పూర్తిస్థాయి నివాసయోగ్యత కల్పించే దిశలో అడుగులు పడుతున్నాయి.