Idream media
Idream media
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జారీ చేసిన షెడ్యూల్‌ను హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు ఏపీ హైకోర్టు డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇరు వైపు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేయగా.. అదే రోజు సాయంత్రం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
సహేతుకంగా లేదంటూ సస్పెండ్..
ఈ నెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ షెడ్యూల్ జారీ చేయగా.. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో సాధ్యం కాదంటూ, షెడ్యూల్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదంటూ కూడా ఆక్షేపించింది. నిమ్మగడ్డ నిర్ణయం ఆర్టికల్ 14, 21లన ఉల్లంఘించేదిగా ఉందని వ్యాఖ్యానించింది.
ఈ నెలలోనే ఎన్నికలకు ..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ నెల 8వ తేదీన షెడ్యూల్ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి వ్యతిరేకంగా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేదుకు అనుగుణంగా.. ఈ నెల 23, 27, 31 తేదీల్లో వరుసగా తొలి, రెండు, మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్, వచ్చే నెల 4న నాలుగో దశ నోటిఫికేషన్ జారీ చేసేలా షెడ్యూల్ ప్రకటించారు. వచ్చే నెల 5, 7, 9, 17 తేదీల్లో ఉదయం 6:30 గంటలకు నుంచి మధ్యాహ్నం 3: 30 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్న నిమ్మగడ్డకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.