iDreamPost
android-app
ios-app

Sunkara Pavani – కాకినాడ మాజీ మేయర్‌ పిటిషన్‌ మరో సారి వాయిదా

  • Published Oct 22, 2021 | 3:06 PM Updated Updated Oct 22, 2021 | 3:06 PM
Sunkara Pavani – కాకినాడ మాజీ మేయర్‌ పిటిషన్‌ మరో సారి వాయిదా

తనపై నిబంధనలకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, అందుకు సంబంధించిన నోటీసును కూడా తనకు ఇవ్వలేదని పేర్కొంటూ కాకినాడ మాజీ మేయర్‌ సుంకరపావని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మాజీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కార్పొరేషన్‌ చట్టంలోని అంశాలను, ఇతర వివరాలు సమర్పించాలని కలెక్టర్‌ హరికిరణ్‌ ను ఆదేశించింది.

జరిగిందిదీ..

పార్టీలకతీతంగా 33 మంది ఏకమై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వగా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఈ నెల 5వ తేదీన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాలుగేళ్లుగా మేయర్‌గా ఉన్న పావని మెజార్టీ కార్పొరేటర్ల విశ్వాసం కోల్పోయిన సంగతి తెలిసిందే. తాను పదవిని చేపట్టి నాలుగేళ్ళు పూర్తికాలేదని, మున్సిపల్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహిస్తున్నారని, ఆ సమావేశం నిర్వహించకుడా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పావని ఈనెల 2న హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 22కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.  

ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌.. 

అయితే కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వనందున ఈ నెల 5వ తేదీన సమావేశం యథావిధిగా నిర్వహించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. కౌన్సిల్‌ విశ్వాసం కోల్పోవడంతో మేయర్‌ పావని, డిప్యూటీ మేయర్‌ కాలా భీమశంకర సుబ్రహ్మణ్యేశ్వర సత్తిబాబులను పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఈ నెల 12న జీవోఎంఎస్‌ నంబర్‌ 128 ద్వారా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్‌ పోస్టుల భర్తీపై కలెక్టర్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపగా ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నీ ఈ నెల 20 నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

దీని ప్రకారం కలెక్టర్‌  21వ తేదీన కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులకు ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశం నోటీసులు పంపారు. నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నిక జరుగుతుంది. ఏ కారణం వల్లనైనా ఎన్నిక జరగకపోతే 26వ తేదీన ఎన్నిక జరిపేందుకు ఎస్‌ఈసీ అనుమతి ఇచ్చింది. అప్పుడు కూడా సాధ్యం కాకపోతే ఆ విషయాన్ని మళ్లీ తమ దృష్టికి తీసుకురావాలని ఎస్‌ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

25న మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక యథాతథం

కేసు వాయిదా పడినప్పటికీ ఈ నెల 25వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ అమలు చేసేందుకు కార్పొరేషన్‌ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. న్యాయస్థానం కలెక్టర్‌కు ఈ ఎన్నికను ఆపాలని ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వనందున ఈనెల 25న ఆ పదవులకు ఎన్నిక జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

Also Read : Kakinada Corporation – 25న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక