Idream media
Idream media
ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్కాంలో ఏసీబీ విచారణ పూర్తయిందని, తనను అరెస్ట్ చేసి 45 రోజులు దాటినందున బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం అచ్చెం నాయుడు అనారోగ్య కారణాలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జుడీషియల్ రిమాండ్‌లో ఉంటున్నారు.
బెయిల్ పిటిషన్‌పై జరిగిన వాదోపవాదాలలో హైకోర్టు ఏసీబీ వాదనలను సమర్థించింది. ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, విచారణ మధ్యలో బెయిల్ ఇవ్వద్దొని ఏసీబీ తరఫున ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అచ్చెం నాయుడు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
జూన్ 13వ తేదీన అచ్చెం నాయుడును ఏసీబీ అధికారులు ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఏసీబీ కోర్టులో దాఖలు చే సుకున్న పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. మొలల ఆపరేషన్ వల్ల అచ్చెం నాయుడు గుంటూరు సర్వజన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ నెల 1వ తేదీన డిశ్చార్జి కాగా.. పోలీసులు అచ్చెం నాయుడును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని, ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అచ్చెం నాయుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ నెల 8వ తేదీన అచ్చెం నాయుడును అధికారులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందా..? లేదా..? ప్రస్తుత పరిస్థితి ఏమిటి..? అనేది ఆస్పత్రి నుంచి వెల్లడికావడంలేదు.
ఈ స్కాంలో మూడో ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి పితాని సత్యానారాయణ కుమారుడు పితాని సురేష్ పరారిలో ఉన్నారు. ఏసీబీ అతని కోసం గాలిస్తోంది. సురేష్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అయినా అతను అజ్ఞాతంలోనే ఉంటున్నారు. ఈ వ్యవహారంలో నిందితుడుగా ఉన్న పితాని మాజీ పీఎస్ మురళీమోహన్‌ను ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.