iDreamPost
android-app
ios-app

సుప్రింకు చేరిన జల వివాదం.. తెలంగాణను తూర్పారబట్టిన..

సుప్రింకు చేరిన జల వివాదం.. తెలంగాణను తూర్పారబట్టిన..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరుకుంది. కృష్ణా జిలాల వినియోగంలో తెలంగాణ వైఖరిని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రింలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఏపీకి న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జిలాలను దుర్వినియోగం చేస్తోందని ఏపీ తన పిటిషన్‌లో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా, విభజన చట్టాన్ని ఉల్లంఘిచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. విద్యుత్‌ ఉత్పత్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం గత నెల 28వ తేదీన జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరింది. వెంటనే కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ పరిధిని నోటిఫై చేయాలని విన్నవించింది.

కేంద్రం పట్టించుకోకపోవడంతో..

ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నా.. కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీటి అవసరం లేకపోయినా.. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఫలితంగా ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. విలువైన జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. దీని వల్ల రాయలసీమ, నాగార్జున సాగర్, కృష్ణా డెల్టా పరిధిలోని ఆయకట్టుకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. విద్యుత ఉత్పత్తిని ఆపాలంటూ పలుమార్లు విన్నవించినా.. తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. తెలంగాణ వైఖరిని, తమ ఆందోళనను వివరిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృష్ణా నది యాజమాన్య మండలి (కేఆర్‌ఎంబీ)కి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి విన్నవించారు. సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకుని, తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే ఏపీ ఆందోళనను, విజ్ఞప్తిని కేంద్రం కూడా పట్టించుకోలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఏపీ సర్కార్‌.. సుప్రింను ఆశ్రయించింది.

ఉత్సవ విగ్రహంలా కేఆర్‌ఎంబీ..

కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య వివాదం జరుగుతున్నా… ఘర్షణ వాతావరం నెలకొన్నా.. విలువైన జలాలు సముద్రంలో కలుస్తున్నా.. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చోద్యం చూస్తోంది. తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండడంతో.. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రతి రోజు దాదాపు ఒక టీఎంసీ జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఈ వివాదంపై చర్చించేందుకు ఈ నెల 9వ తేదీన సమావేశం ఏర్పాటు చేసిన కేఆర్‌ఎంబీ.. ఆ తర్వాత తెలంగాణ చేసిన విజ్ఞప్తితో దాన్ని 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుండడంతో ఏపీ సర్కార్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఏపీ ఆందోళనను సుప్రిం పరిగణలోకి తీసుకుంటుందా..? లేదా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం తమ హక్కు అంటున్న తెలంగాణ వాదనన సమర్థిస్తుందా..? చూడాలి.

Also Read : అప్పుడు ఉత్తరాంధ్ర.. ఇప్పుడు రాయలసీమ మరింత దూరమవుతున్న బాబు