అవినీతి నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అవినీతిపై ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. అవినీతిపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 14400 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి “కాల్ సెంటర్’ ని ఈరోజు ప్రారంభించారు. జగన్ స్వయంగా కాల్ చేసి కాల్ సెంటర్ పనితీరు వివరాలను తెలుసుకున్నారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదులపై దర్యాప్తులను 15 రోజులనుండి 30 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అవినీతి రహిత పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని జగన్ తెలిపారు.
గతంలో ఇసుక అక్రమరవాణాపై ఫిర్యాదులకొరకు 14500 అనే టోల్ ఫ్రీ నంబర్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. అవినీతిని నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.