iDreamPost
android-app
ios-app

జగన్‌ చొరవతో పాతికేళ్ల కల సాకారం

  • Published Jan 21, 2022 | 5:51 AM Updated Updated Jan 21, 2022 | 5:51 AM
జగన్‌ చొరవతో పాతికేళ్ల కల సాకారం

పాతికేళ్లుగా ఎంపీడీవోలు కంటున్న కలలు నెరవేరుతున్నాయి. 25 సంవత్సరాల కిందట ఎంపీడీవోలుగా ఉద్యోగంలో చేరినవారు కూడా అప్పటి నుంచి పదోన్నతులు లేకుండా ఇంకా అలాగే కొనసాగుతున్నారు. ఉద్యోగ విరమణ చేసేలోగా ఒక్క పదోన్నతి వస్తుందా అని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. వారి కల ఇప్పుడు నెరవేరబోతోంది. ఎంపీడీవోలకు పదోన్నతి కల్పించడానికి వారి క్యాడర్‌కు పైస్థాయిలో తగినన్ని పోస్టులు లేకపోవడంతో వారి పదోన్నతి ప్రక్రియ ఇన్నాళ్లూ నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఉత్తర్వులు జారీ

గ్రామీణాభివృద్ధిశాఖలో 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్‌ రూపంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతులపై నియమించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణాభివృద్ధిశాఖలోని కమిషనర్‌ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం, వాటర్‌షెడ్‌ పథకం విభాగాల్లో 9 కేటగిరీల్లో 15 పోస్టులు, జిల్లాల్లోని డ్వామా పీడీ కార్యాలయాల్లో మరో 9 కేటగిరీల్లో 134 పోస్టులు కలిపి మొత్తం 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్‌ విధానంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతి ద్వారా నియమించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ 149 పోస్టుల్లో ప్రస్తుతం డిప్యుటేషన్, ఆన్‌డ్యూటీలో కొనసాగుతున్నవారు నిర్ణీత సర్వీసు కాలం ఆ పోస్టుల్లోనే కొనసాగుతారని, భవిష్యత్‌లో ఆ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల్లోనే ఎంపీడీవోలను పదోన్నతిపై నియమించనున్నట్లు తెలిపారు.

200 మందికిపైగా ఒకేసారి పదోన్నతి..

పాతికేళ్లుగా ఎంపీడీవోలు పదోన్నతులకు నోచుకోని అంశంపై జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దృష్టి పెట్టారు. దీంతో పదోన్నతులకు వేచి ఉన్నవారికి ఒకేసారి పెద్దసంఖ్యలో పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఇప్పటికే డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ (డీఎల్‌డీవో) పోస్టు వ్యవస్థను ఏర్పాటు చేసి కొత్తగా 51 డీఎల్‌డీవో పోస్టులను ఎంపీడీవోలకు పదోన్నతి ద్వారా భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో 149 పోస్టుల కోసం  పదోన్నతికి వీలు కల్పించింది. ఒకేసారి 200 మందికిపైగా ఎంపీడీవోలకు పదోన్నతి దక్కేలా కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. తమ దీర్ఘకాల సమస్యపై దృష్టి సారించి పదోన్నతులకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీడీవోలు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Also Read : హామీలను జగన్‌ అమలు చేయడంలేదంటున్న బీజేపీ నేత