iDreamPost
android-app
ios-app

అమరావతి భూ కుంభకోణం: హైకోర్టు తీర్పుపై సుప్రింకు ఏపీ ప్రభుత్వం

అమరావతి భూ కుంభకోణం: హైకోర్టు తీర్పుపై సుప్రింకు ఏపీ ప్రభుత్వం

అమరావతి భూ కుంభకోణంపై మాజీ ఏజీ దొమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రిం కోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ (ఎన్‌వీ రమణ) కుమార్తెలు సహా 13 మందిపై ఏసీబీ చేస్తున్న విచారణపై స్టే విధిస్తూ, ఎఫ్‌ఐఆర్‌ కూడా బయటపెట్టకూడదని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రిం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రింలో సవాల్‌ చేసింది. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేసింది.

దొమ్మాలపాటి శ్రీనివాస్‌ అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే అక్కడ భూములు కొనుగోలు చేశారని, వాటిని తన మామ, బావమరుదలపై రిజిస్ట్రేషన్‌ చేయించి ఆ తర్వాత 2015, 2016 ఏడాదుల్లో తను, తన భార్య పేరుపై మార్చుకున్నారని ఏసీబీ అభియోగాలు మోపింది. ప్రాథమిక విచారణ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ కూడా వేసింది. ఆయనతోపాటు సుప్రిం కోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కుమార్తెలు కూడా రాజధాని ప్రకటించక ముందే అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు కేసు నమోదు చేసింది. మొత్తంగా ఏసీబీ 13 మందిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది.

తనపై ఏసీబీ చేస్తున్న విచారణను ఆపాలని, తన పరువు, ప్రతిష్టలకు భంగం కలగకుండా ఎఫ్‌ఐఆర్‌ను ఏసీబీ బయటపెట్టకుండా, మీడియాలో ప్రసారం కాకుండా, సోషల్‌ మీడియాలోనూ రాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దొమ్మాలపాటి కేసు నమోదైన రోజునే హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. దొమ్మాలపాటి కోరినట్లు.. విచారణపై స్టే విధించింది. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు బయటకు రాకుండా గ్యాంగ్‌ ఆర్డర్‌ను జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై దేశ వ్యాప్తంగా న్యాయ కోవిదులు, మీడియా ప్రముఖులు విస్మయం వ్యక్తం చేశారు. సహజ హక్కులకు భిన్నంగా ఉన్న ఈ తీర్పుపై పునఃసమీక్ష చేయాలని సూచించారు.

మాజీ ఏజీతో సహా సుప్రిం న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కుమార్తెలు కూడా ఇందులో ఉండడంతోనే హైకోర్టు న్యాయమూర్తులు ఈ విధంగా తీర్పు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. అధికార వైసీపీ నేతలు హైకోర్టు తీర్పుపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మాజీ న్యాయమూర్తులు కూడా ఏపీ హైకోర్టు తీర్పు సరికాదని, పనితీరుపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం సుప్రింలో దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. అమరావతి భూ కుంభకోణంపై విచారణ జరిగేలా హైకోర్టు విధించిన స్టేను సుప్రిం ఎత్తివేస్తుందా..? లేదా సమర్థిస్తూ దర్యాప్తునకు బ్రేక్‌ వేస్తుందా..? అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.