iDreamPost
android-app
ios-app

ఏపీ ప్రభుత్వం విన్నూత్న ఆలోచన – మద్యం దుష్ప్రభావాలపై షార్ట్ ఫిల్మ్ పోటీలు

ఏపీ ప్రభుత్వం విన్నూత్న ఆలోచన – మద్యం దుష్ప్రభావాలపై షార్ట్ ఫిల్మ్ పోటీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నూత్న ఆలోచన చేసింది. పలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యం మహమ్మరిని నియంత్రించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం మరో విన్నూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మద్యం వల్ల కలిగే దుష్ప్రచారం మరియు దుష్ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలియజేసేలా చేసేందుకు షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మద్య విమోచన ప్రచార కమిటీ షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా “మద్యం దుష్ప్రభావాలు, రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం అమలు” అనే సబ్జెక్ట్‌పై షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించాలని షార్ట్ ఫిల్మ్ రూపకర్తలకు ఆహ్వానాలు పంపింది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు.

పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న ఏ ఒక్కరైనా రెండు తెలుగు రాష్ట్రాల నుండి తమ షార్ట్ ఫిల్మ్‌లను ప్రభుత్వానికి పంపవచ్చు. తెలుగులో రూపొందించిన 5-10 నిమిషాల నిడివితో ఉన్న షార్ట్ ఫిల్మ్‌లను సెప్టెంబర్ 25లోపు apmvpc.gov.in@gmail.comకు పంపాలని మంత్రి పేర్ని నాని తెలిపారు. 15 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి బహుమతులతో పాటు ప్రభుత్వ ప్రశంసా పత్రం అందిస్తామని మద్య విమోచన ప్రచార కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఈ కాంటెస్ట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆసక్తి గలిగిన వారు పాల్గొనవచ్చు. కాగా ఆసక్తిగల షార్ట్ ఫిల్మ్ రూపకర్తలు రిజిస్ట్రేషన్ల కోసం 9381243599, 8790005577 నెంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈ విన్నూత్న ప్రయత్నం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.