iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పెద్ద మనసు చాటుకుంది. ప్రకృతి విపత్తులో చిక్కుకుని నష్టపోయిన అన్ని కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. అదే సమయంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. మృతుల కుటుంబాల్లో అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. వరదలో చిక్కుకుని మరణించిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. నెల్లూరులో మరణించిన కానిస్టేబుల్ కి కూడా అదే రీతిలో పరిహారం అందించబోతోంది. ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తామని సీఎం ప్రకటించారు.
వరదలు, భారీ వర్షాల కారణంగా జరిగిన విపత్తు నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సమావేశం నిర్వహించారు. అధికారులతో మాట్లాడారు. కలెక్టర్లు, ప్రత్యేక అధికారులుగా వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. తక్షణ సహాయం అందించాలని తెలిపారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకులతో పాటుగా కుటుంబానికి రూ. 2వేల చొప్పున సహాయం అందించాలని ఆదేశించారు. దాంతో పాటుగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ 91 వేల నష్టపరిహారం, పాక్షికంగా ఇల్లు దెబ్బతింటే రూ. 5వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
వరద బాధితుల పట్ల ఉదారంగా ఉంటూ ప్రతీ కుటుంబానికి పరిహారం అందించే దిశలో అధికారులు సంసిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణమే కొత్త ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పశువులు మరణించి, పంట నష్టపోయిన వారికి కూడా తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. పంట నష్టం విషయమై అంచనాలు వేయాలని తెలిపారు. వరద సహాయం విషయంలో ఎటువంటి సమస్య రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సహాయక శిబిరాల్లో లోటు రాకుండా చూడాలని సూచించారు.
అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలంతా సహాయక చర్యల్లో ఉండాలని అధికార పార్టీ అధినేతగా వైఎస్ జగన్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం ఆదేశించడంతో ఆయా నియోజకవర్గాల సహాయక చర్యలకు సంబంధించి ఎమ్మెల్యేలంతా ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులకు పూర్తి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.