iDreamPost
iDreamPost
గ్రామీణ స్థాయిలో రైతులు, ఇతర వృత్తిదారులకు మేలు చేకూర్చాలన్న సదాశయంతో సహకార రంగం ఏర్పాటైంది. అయితే ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రారంభంలో ఉన్నంత ఉన్నతంగా లేవన్నది గత ప్రభుత్వ హాయంలో తేలిపోయింది. ఆయా సంఘాల ఛైర్మన్‌లు, పాలకవర్గాలు, సిబ్బంది కుమ్మక్కై కోట్లాది రూపాయలను అర్హులకు అందకుండా పక్కదారి పట్టించడం వంటివి ఇటీవలే విస్తృతంగా బైటపడుతున్నాయి.
రైతులకు అండదండలుగా ఉండాల్సిన సొసైటీలు కండబలమో, అధికార బలమో కలిగిన వారికి మాత్రమే ఉపయోగపడుతున్న వైనాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో సహకార రంగం సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాల హాయంలో జరిగిన లోటుపాట్లు గుర్తించి వాటిని పూర్తిగా మార్చేందుకు నిర్ణయించింది. ఏ సొసైటీని తట్టినా గత ప్రభుత్వ హాయంలో పక్కదారి పట్టిన నిధుల లెక్కలు మిక్కిలిగా బైటపడుతుండడం సహకార రంగం అభివృద్ధిని కోరుకునే వారిలో తీవ్ర ఆందోళనలు రేపింది. గ్రామీణ స్థాయిలో రైతులకు ఆర్ధిక దన్నుతో పాటు, వివిధ రకాల సేవల ద్వారా సాగును ప్రోత్సహించడంలో సొసైటీలు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇతర సొసైటీలకు ఆదర్శంగా పలు సొసైటీలు రైతులకు వినూత్నమైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి అందరి మెప్పు పొందినవి అతి కొద్దిగానే ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో సహకార వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పలు మార్పులను ప్రతిపాదిస్తూ జీవో 90ని జారీ చేసింది. రాష్ట్రస్థాయి సాధికారిక కమిటీ సిఫార్స్‌ల మేరకు కీలక అంశాలను జీవోలో చేర్చింది. ప్రతి మూడేళ్ళకు రెవిన్యూ డివిజన్ స్థాయిలో సాధారణ బదిలీలు జరపాలని జీవోలో పేర్కొంది. అలాగే సీఈవోలు ఒకే చోట అయిదేళ్ళకు మించి పనిచేయరాదన్న నిబంధనను కూడా తీసుకువచ్చింది. సీఈవోలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌లకు విద్యార్హలతలు నిర్ణయించింది. అయిదేళ్ళలోపు సదరు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్‌ను అందజేసేందుకు వెసులుబాటు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెండువేలకు పైగా ఉన్న సహకార సొసైటీల్లో నాలుగువేల మందికిపైగా పనిచేస్తున్నారు.