దేశంలో అత్యంత ప్రమాదకరంగా మారిన కరోనా మహమ్మారిని కట్టడి చేయటానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రధాన మంత్రి మోడి ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు, హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక మంది సామాన్య ప్రజలు ఇక్కట్లు పాలయ్యారు. వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు చర్యలు చేపట్టగా స్పూర్తిపొందిన అనేకమంది సామాన్యులు, రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు , ఉద్యోగులు సైతం ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎవరికి తగ్గ స్తోమతతో వారు ప్రభుత్వానికి విరాళాలు ప్రకటించారు.
అయితే ఆపద సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన వారికి తోడుగా ఉండాలనే ఆలొచనతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 1961 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి. ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read:-లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్నవారి కోసం …అన్నదాత పెద్ద మనసు
ఇప్పటికే విరాళాలు ప్రకటించిన ప్రముఖుల్లో ఎంపీ బాలశౌరి సీఎం సహాయనిధికి ఎంపీ లాడ్స్ నుంచి రూ.4 కోట్లు ఇవ్వగా, వైఎస్సార్సీపీ ఎంపీలు తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందులో ఒక నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే అనేక మంది అధికార పక్ష శాసన సభ్యులు సైతం భారీగా విరాళాలు ప్రకటించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సైతం 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తునట్టు ప్రకటించారు .
ఇక సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ చెరో కోటి రూపాయలు, మహేశ్‌బాబు కోటి రూపాయలు. రామ్ చరణ్ 70 లక్షలు, నితిన్ 10 లక్షలు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోటి రూపాయలు, జూనియర్ ఎన్.టి.ఆర్ 50 లక్షలు విరాళం ప్రకటించారు. వీరితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, దిల్ రాజు తమ వంతు సాయం చేశారు. వీరు ప్రకటించిన విరాళాల్లో సగం తెలంగాణ సగం ఆంధ్రాకు కేటాయిస్తునట్టు చెప్పుకొచ్చారు.
అలాగే ఉద్యోగులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు వేతనం (రూ.5.30 కోట్లు) విరాళంగా ప్రకటించారు. వీరితో పాటు అనేక మంది సామాన్యుల సైతం సమాజిక మాధ్యమాల ద్వారా ప్రేరణ పొంది స్వచ్చందంగా తమకు తోచినంత సహాయం చేసి మరి కొంతమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. సియం సహాయ నిధి వెబ్సైట్ లో ఉన్న బ్యాంక్ ఖాతా నెంబర్లు పెడుతు రాష్ట్రం ఎదుర్కుంటున్న ఈ విపత్కర పరిస్తితుల్లో సహాయంగా నిలబడండి అనే సందేశాన్ని పంపుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ఎదుర్కుంటున్న ఈ విపత్కర స్థితిలో ముఖ్యమంత్రి తమ కృషి తాము చేస్తుంటే ప్రజలు సైతం స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అండగా నిలబడి సహకరంచడం సంతోషించదగ్గ పరిణామం.
6193