iDreamPost
iDreamPost
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. ఏ మాటా పడకుండా పెళ్లి చేయడం, ఏ వంకా లేని విధంగా ఇల్లు కట్టడం చాలా కష్టం. అలాంటిది కొన్ని లక్షల ఇళ్లు కట్టడానికి ఒక ప్రభుత్వం నడుం బిగించడం, అది కూడా పేదల సొంతింటి కలను సాకారం చేయడం కోసం అన్నది అసాధారణమైన చర్య. ఇలాంటి సాహసానికే పూనుకుంది ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. నవరత్నాలు – అందరికీ ఇళ్లు పథకం రూపొందించింది. ఓ లక్ష, రెండు లక్షల ఇళ్లను ఆ విధంగా కట్టి ఇవ్వడమే ఎంతటి ప్రభుత్వానికైనా కష్టం. అటువంటిది రాష్ట్రంలోని అర్హులైన మొత్తం పేదలకు ఏకంగా 31 లక్షల ఇళ్లను కట్టి ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించి రంగంలోకి దిగింది.
నిన్నటి పేదలు.. నేడు లక్షాధికారులు..
లబ్ధిదారులందరికి ఒకేసారి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసి తమది చేతల ప్రభుత్వం అని నిరూపించుకుంది. సెంటు స్థలం చొప్పున ప్రతి లబ్ధిదారుకు రిజిస్ట్రేషను, జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేసి పట్టాలను పంపిణీ చేసింది. ఆయా ప్రాంతాల్లో భూమికి ఉన్న విలువను బట్టి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల విలువచేసే ఈ స్థలాలను అందుకున్న 31 లక్షల మంది పేదలు ఒకేసారి లక్షాధికారులయ్యారు.
లబ్ధిదారులకు స్వేచ్చ..
ఇంటి స్థలం పట్టా పొందినవారికి ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. మొదటి దానిలో ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును లబ్ధిదారు ఖాతాలో వేస్తుంది. ఆ సొమ్ముతో తాము కోరుకున్న విధంగా ఇంటిని నిర్మించుకోవచ్చు. ఇక రెండో ఆప్షన్లో ప్రభుత్వం ఇంటి నిర్మాణ సామగ్రిని అందజేస్తుంది. లబ్ధిదారు ఇల్లు నిర్మించుకోవచ్చు. మూడో ఆప్షన్లో ప్రభుత్వమే పూర్తిగా ఇల్లు నిర్మించి ఇస్తుంది.
Also Read : హనుమంతరాయ చౌదరి పదవి కోసమేనా యాత్రలు,కొట్లాటలు?
ఇదీ ప్రగతి…
రెండు విడతల్లో ఈ గృహాల నిర్మాణం సాగుతుంది. మొదటి విడతలో 15.60 లక్షలకుగాను 10.11 లక్షల ఇళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా భూమి పూజలు నిర్వహించారు. ఇప్పటికే 4,708 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 8,74,569 పునాది దశలో ఉండగా 81,467 పునాది దశను పూర్తి చేసుకున్నాయి. 27 వేలకు పైబడి ఇళ్లు పైకప్పును పూర్తి చేసుకున్నాయి. 938 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మూడో ఆప్షన్ ఎన్నుకున్న 3.25 లక్షల మందికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం అక్టోబరు 2న ప్రారంభించనుంది.
చంద్రబాబు ఆక్రోశం..
ఇన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలా? ఎలా ఇవ్వగలరు? అయినా సెంటు స్థలంలో ఇల్లెలా నిర్మిస్తారు అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తనదైన శైలిలో విమర్శలు చేశారు. తీరా 31లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఒకేసారి పంపిణీ చేయడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ స్థలాలు ఇంటి నిర్మాణానికి అనువుగా లేవు అంటూ కొత్త రాగం అందుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్నిచోట్ల స్థలాల్లో నీరు చేరడాన్ని సాకుగా తీసుకుని అక్కడ తెలుగుదేశం నాయకులను ధర్నాలు చేయమని పురమాయించారు. ఇలాంటి పిలుపులకు ఎలా స్పందించాలో తెలిసిన తెలుగు తమ్ముళ్ళ ఆ స్థలాల వద్దకు వెళ్లి, ఫొటోలు దిగి పార్టీ ఆఫీసుకు పంపి చేతులు దులుపుకున్నారు.
అక్కడ నిర్మించేది ఇళ్లు కాదు.. ఊళ్లు..
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల పేరుతో పెద్దఎత్తున జరుగుతున్న ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతోంది. దాదాపు 17, 500 లే అవుట్లలో అక్కడ నిర్మితమయ్యేది ఇళ్లు కాదు ఊళ్లు అని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. నగర, పట్టణ శివార్లలో పెద్దపెద్ద టౌన్ షిప్ లు, గ్రామాలకు సమీపంలో అయితే కొత్తగా మరికొన్ని గ్రామాల నిర్మాణమే సాగుతోంది. చక్కటి ఇంజినీరింగ్ తో, అన్ని సౌకర్యాలతో, అధికారుల పర్యవేక్షణలో పొందికగా వీటిని రూపొందిస్తున్నారు. ఏనాడూ సహేతుక విమర్శ చేయని ప్రతిపక్షం, రకరకాలుగా చేస్తున్న విష ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాధ్యమైనంత త్వరగా సాకారం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇళ్ల నిర్మాణం పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ సమీక్ష నిర్వహిస్తున్నారు.
Also Read : కొత్త వేషం.. ఉత్తుత్తి రోషం.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ..