Idream media
Idream media
ఉచిత విద్యుత్ పై విమర్శలు చేసే వారెవరైనా ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న తాజా నిర్ణయంతో ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇచ్చిన మాటకు కట్టుబడడమే కాదు.. ఆ మాటను శాశ్వతంగా నిలుపుకునేందుకు జగన్ ఎంతలా ఆలోచిస్తారో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే చెబుతాయి. ఉచిత విద్యుత్ పై ఆరోపణలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కరెంటు బిల్లులు కట్టలేక ఎందరో రైతులు రోడ్డెక్కారు. ఆందోళన బాట పట్టారు. అలాగే విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం జరిగిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎంతకు తెగబడ్డారో అందరికీ తెలిసిందే. 20 ఏళ్లు గడిచినా నాటి ప్రభుత్వం చేసిన దమనకాండ తాలూకు మరకలు అలాగే ఉన్నాయి. అందుకే ఉచిత విద్యుత్ అనే పదం ఉపయోగించే హక్కు చంద్రబాబుకు లేదని చాలా సందర్బాల్లో చాలా మంది నోట వినిపిస్తున్న మాట.
నగదు బదిలీ వెనుక ఉద్దేశమిదే…
‘వైఎస్సార్ ఉచిత విద్యుత్’ పథకం ద్వారా రైతుకు చేసే మేలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని జగన్ భావించారు. ఆ దిశగా ఆలోచించి ఉచిత విద్యుత్ పథకాన్ని కనీసం మరో 30 ఏళ్లు సమర్ధవంతంగా అమలు చేయాలని సంకల్పించారు. విద్యుత్ బిల్లులను నేరుగా ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తే సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు.. ఉచితంగా కరెంటును పొందుతున్నారన్న భావంతో రైతుల ఫిర్యాదులను అధికారులు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో సమాలోచనలు చేసి జగన్ నగదు బదిలీని ప్రవేశపెట్టారు. నేరుగా రైతుల ఖాతాలలోనే బిల్లుల రుసుం జమ చేసి వారే కట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. రైతుల నుంచే బిల్లుల రుసుం తీసుకుంటున్న అధికారులు వారికి సమస్యలు వచ్చినప్పుడు బాధ్యతాయుతంగా పని చేసే అవకాశం ఉంటుంది.
మరో కీలక అడుగు…
పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించే అ ‘వైఎస్సార్ ఉచిత విద్యుత్’ పథకానికి సంబంధించి.. ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ పథకం కోసమే ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వాటికి సంబంధించి టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది. తొలిదశలో.. అనంతపురం, వైఎస్సార్ కడప, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో 6,050 మెగావాట్లకు టెండర్లు పిలుస్తున్నట్లు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్ష (జ్యూడీషియల్ ప్రివ్యూ)కు పంపింది.
వెబ్‌సైట్ లో సమాచారం..
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పర్యవేక్షణలో జరిగే టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జ్యూడీషియల్ ప్రివ్యూ అధికారిక వెబ్‌సైట్ ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. జ్యూడీషియల్ ప్రివ్యూ.ఏపీ.జీవోవీ.ఇన్’లో పొందుపర్చింది. వీటిని పరిశీలించి ప్రజలు, కాంట్రాక్టు సంస్థలు, నిపుణులు అవసరమైన సలహాలు, సూచనలు ఈనెల 25లోగా ‘ఏపీజ్యూడీషియల్‌ప్రీవ్యూ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ లేదా ‘జడ్జి–జేపీపీ ఎట్ ది రేట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్‌కు పంపవచ్చని ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. పీఎంయు డాట్ ఏపీజీఈసీఎల్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్’కు కూడా సూచనలు పంపవచ్చని తెలిపింది. జ్యూడీషియల్ ప్రివ్యూ తర్వాతే పనులకు సంబంధించిన టెండర్లు పిలుస్తారని పేర్కొంది. ఈ చర్యలన్నీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి పూర్తి న్యాయం చేయాలనే జగన్ సర్కార్ చిత్తశుద్ధిని తెలియజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.