iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం ప్రకారం జిల్లాల విభజనపై కీలక కమిటీ నియామకం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. జిల్లాల పునర్విభజనపై పరిశీలిన చేసి , మెరుగైన విధానంపై కమిటీ రిపోర్ట్ అందించబోతోంది. వీలయినంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని కోరినట్టు ప్రభుత్వం చెప్పింది. నిర్ధిష్ట కాలపరిమితి లేకపోవడంతో ఎప్పటికీ ఈ ప్రక్రియ పూర్తవుతుందోననే సందిగ్ధం కనిపిస్తోంది.
జిల్లా పునర్‌వ్యవస్థీకరణపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ అంశంపై ఇప్పటికే మొదలయిన చర్చ మరింత ఆసక్తికరంగా మారబోతంది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుందని క్యాబినెట్ తీర్మానంలో పేర్కొన్నారు. కానీ క్యాబినెట్ వివరాలను మీడియా ముందు వెల్లడించిన మంత్రి పేర్ని నాని మాత్రం భిన్నంగా వ్యాఖ్యానించారు. 25 లేదా 26 జిల్లాల ఏర్పాటు విషయంలో కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతోందని ఆయన ప్రకటించారు. జిల్లాల ఏర్పాటులో ఖర్చును నియంత్రించడం సహా వివిధ అంశాలను కమిటీ అధ్యయనం చేయబోతోందని తెలిపారు.
చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయగా, అందులో సభ్యులుగా సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. కన్వీనర్‌గా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండబోతున్నారు. జిల్లాల విభజన లో సీఎం అభిప్రాయాలను కమిటీ కి తెలియజేయడం కోసం సీఎంవో నుంచి ఒక అధికారిని నియమించినట్టు నాని వెల్లడించారు. మానవవనరులను వీలైనంత సమర్థవంతగా వినియోగించుకోవడం, మౌళికసదుపాయాలను వినియోగించుకోవడం లక్ష్యాలుగా జిల్లాల విభజన చేయబోతున్నట్టు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు నేపథ్యంలో ఈ పునర్‌వ్యవస్థీకరణ అవసరమని భావించిన మంత్రివర్గం దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు.
ఏపీలో ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం ఓ జిల్లాగా విభజించేందుకు సీఎం జగన్ ఎన్నికల సమయంలోనే ప్రకటన చేశారు. మ్యానిఫెస్టోలో దానిని ప్రస్తావించారు. దానికి అనుగుణంగా జిల్లాల విభజన కోసం కొంత ప్రయత్నం జరిగింది. అయితే వివిధ కారణాలతో గత ఏడాది ఈ ప్రయత్నం విరమించుకున్నారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం జిల్లాల పునర్విభజన ప్రయత్నాలు ముందుకొచ్చినప్పటికీ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు కారణంగా ముందుకు సాగలేదు. జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయడం కోసం రెవెన్యూ సరిహద్దులు మార్చుకుండా ఫ్రీజింగ్ అమలు చేస్తున్నారు. అయితే ప్ర్రస్తుతం జనాభా లెక్కల సేకరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా కారణంగా పదేళ్లకు ఓసారి జరగాల్సిన ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారనే స్పష్టత లేదు. దాంతో ఈ ఫ్రీజింగ్ ఉత్తర్వులను సడలించే దిశలో కేంద్రం ఆలోచన చేయబోతున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో త్వరలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తే వెంటనే జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసేందుకు అనుగుణంగా కసరత్తులు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్టుగానే అధ్యయన కమిటీ తెరమీదకు వచ్చింది. కమిటీ రిపోర్ట్ ప్రాతిపదికన 25 లేదా 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో ఏ జిల్లా పరిధిలో ఏ ప్రాంతాలు ఉంటాయన్నదానిపై నివేదికలో పేర్కొనబోతున్నారు. వాటిని ప్రభుత్వం పరిశీలించి, వివిద వర్గాల అభిప్రాయాలు కూడా సేకరించి తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియ పూర్తి చేయగానే వచ్చే సంవత్సరం ఆరంభంలోనే కొత్త జిల్లాలు తెరమీదకు రావడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న దశలో వివిద ప్రతిపాదనలు ముందుకొస్తున్న తరుణంలో అధికారుల కమిటీ ఏవిధంగా నివేదిక రూపొందించబోతుందన్నది చర్చనీయాంశమే.