iDreamPost
android-app
ios-app

రాయలసీమ లిఫ్ట్ పనులకు అసలు కారణమదే, ఎన్జీటీకి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం

  • Published Aug 27, 2021 | 3:51 AM Updated Updated Aug 27, 2021 | 3:51 AM
రాయలసీమ లిఫ్ట్ పనులకు అసలు కారణమదే, ఎన్జీటీకి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇటీవల ఈ లిప్ట్ స్కీమ్ మీద తెలంగాణా నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం తెలిసిందే. దీనిపై ఎన్జీటీ విచారణ సాగుతున్న విషయం కూడా విదితమే. అయితే కేఆర్ఎంబీకి చెందిన ప్రత్యేక బృందం ఈనెలలో పనులను పరిశీలించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఓ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ఈ ఫైలింగ్ జరిగితే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్జీటీ ఇటీవల వెల్లడించింది.

రాయలసీమ లిఫ్ట్ నిమిత్తం పనులు సాగించిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం గతంలోనే చెప్పింది. తాజాగా మరోసారి కేఆర్ఎంబీ బృందం ప్రస్తావించడంతో దానికి కారణాలను వెల్లడించింది. లిఫ్ట్ స్కీమ్ నిర్మాణ ప్రాంతంలో మట్టి నాణ్యత ప్రమాణాల పరిశీలన నిమిత్తం కొద్ది మేర పనులు చేపట్టినట్టు తెలిపింది. డీపీఆర్ కి అనుగుణంగానే ఈ పనులున్నాయని వివరణ ఇచ్చింది. అంతేగాకుండా జూలై 8 తర్వాత వాటిని పూర్తిగా నిలిపివేసినట్టు కూడా వివరించింది.

ఈ స్కీమ్ కి సంబంధించి ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టలేదని గుర్తించాలన్నారు. జాయింట్ కమిటీ రిపోర్టులో కూడా అది ప్రస్తావించ లేదనే విషయం గమనంలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 8.89 కి.మీటర్ల పొడవునా ఉండే అప్రోచ్ చానెల్ నిర్మాణం కోసం చేపట్టాల్సిన పనుల్లో 30 శాతం మాత్రమే జరిగాయన్నారు. 250 లక్షల క్యూబిక్ మీటర్ల పనులకు గానూ 70 వేల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేపట్టినట్టు ఎన్జీటీ దృష్టికి తెచ్చింది. అప్రోచ్ చానెల్ నిర్మాణంలో సున్నపురాయి ఉండడంతో లోతుగా తవ్వకాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇంకా పంప్ హౌస్ నిర్మాణం కోసం 1 నుంచి 12 స్లోపుల కారణంగా ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు గోడలకు తప్ప ఎక్కడ కాంక్రీట్ పనులు చేపట్టలేదన్నారు.

పంప్ హౌస్ నిర్మాణంలో భాగంగా నిపుణుల సూచనల మేరకు పరిశీలన కోసం కేవలం 70 నుంచి 80 అడుగుల మేర తవ్వకాలు చేసినట్టు తెలిపింది. 1.75 క్యూబిక్స్ మీటర్ల పనులు చేపట్టాల్సి ఉండగా దానికి రెండు నుంచి మూడు సీజన్ల సమయం పడుతుందని వివరించింది. పైప్ లైన్ నిర్మాణంలో భాగంగా పరిశీలన నిమిత్తం మాత్రమే పనులు కొద్దిమేర సాగినట్టు స్పష్టం చేసింది.

ఈ అఫిడవిట్ పై తెలంగాణా అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక, ఏపీ ప్రభుత్వం వక్రీకరణ చేస్తోందంటూ విమర్శలు చేసింది. ఈ పరిస్థితుల్లో ఎన్జీటీ తుది తీర్పు ఎలా ఉంటుందోననే చర్చ సాగుతోంది. రాయలసీమ వాసుల సాగునీటి కష్టాలు తీర్చే లక్ష్యంతో మిగులు జలాల వినియోగం కోసం సాగుతున్న ప్రాజెక్ట్ కి ఆటంకాలు తొలగిపోవాలని అంతా ఆశిస్తున్నారు.