iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనా వికేంద్రికరణలో భాగంగా తీసుకున్న నిర్ణయంతో పరిపాలనా రాజధానిగా విశాఖ నగరం సిద్దమవుతుంది. ఈ తరుణంలో ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విమానాశ్రయాలు పోర్టులతో ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలకు అన్ని మార్గాల్లో వ్యాపార వాణిజ్యాలను నడుపుకునేందుకు సులభమైన మార్గం ఉండటంతో అనేక కంపెనీలు విశాఖ కేంద్రంగా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా జపాన్ కు చెందిన యొకోహామా గ్రూప్ కంపెనీ ఏటీజీ విశాఖలో ఆఫ్ హైవే టైర్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 కల్లా ఈ ప్లాంట్ వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు యొకోహామా ఇండియా చైర్మన్ ఏటీజీ డైరెక్టర్ నితిన్ వెలడించారు. దీంతో గుజరాత్ లోని దహేజ్ , తమిళనాడు లోని తిరునల్వేలి తరువాత ఆ సంస్థకు భారత్ లోని విశాఖలో మూడవ ప్లాంట్ గా ఏర్పాటు అవుతునట్టు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా విశాఖ పోర్టు సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లో ఏర్పాటు చేయనున్న ఈ (ఏటీజీ) అలయన్స్ టైస్ గ్రూప్ సంస్థకు ప్రోత్సహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు ప్రతిపాదిత సెజ్ లో ఫ్లాట్ నెంబర్ 7,8లో బ్రాండిక్స్ కు పశ్చిమాన ఉన్న 80.10 ఎకరాలను ఏటీజీ సంస్థకు కేటాయించారు. దీంతో పాటు 5ఏళ్ళ పాటు యూనిట్ 1రూపాయి చొప్పున విద్యుత్ కనక్షన్ రీయంబర్స్ మెంట్ పొందే అవకాశం కల్పించారు. 5 సంవత్సరాల కాలంలో మూలధన పెట్టుబడిలో 5% రాయితీ అందించనున్నారు. అలాగే ఐడీపి 2020-23 ప్రకారం పరిశ్రమకు రాయతీలు వర్తించేలా వెసులుబాటు కల్పించారు.
ప్రభుత్వం కల్పించిన ఈ రాయతీలతో విశాఖలో 1750 కోట్లతో ఏర్పాటుకాబోతున్న ఈ కంపెనీ ద్వారా రాబోయే నాలుగేళ్ళ కాలంలో 2వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించనుంది. జగన్ ప్రభుత్వం రాగానే పెట్టుబడులు రాకపోగా ఉన్న సంస్థలు సైతం తమ వ్యాపారాలు మూసివేసుకుని వెళ్ళిపోతున్నాయి అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న అసత్యప్రచారాలకు ఈ సంస్థ ఏర్పాటుతో నోటికి తాళం పడినట్లైంది. ఏది ఏమైనా విభజన తరువాత పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానాల వలన భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టెందుకు కంపెనీలు ముందుకు రావడం శుభపరిణామమనే చెప్పాలి.