కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆ కష్టాలు దరి చేరలేదు. జగన్ సర్కార్ ఏర్పడిన మొదటి ఏడాదిలో ప్రారంభించిన పథకాలను.. ఆ తర్వాత ఏడాదిలోనూ కొనసాగిస్తూ.. కొత్త పథకాలను ప్రవేశపెడుతూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిత్యం వినిపించే పేద అరుపులు, కేంద్రాన్ని దేబిరింపులు ప్రస్తుత ప్రభుత్వం నుంచి వినిపించడం లేదు. చెప్పిన మాటను తప్పకుండా అమలు చేస్తూ.. వైఎస్ జగన్ కరోనా సమయంలో ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
ఈ నెలలలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలు, రైతులకు సున్నా వడ్డీ రాయితీ, వైఎస్సార్ రైతు భరోసా మూడో ఏడాది అమలు, పంట నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా పరిహారం అందించిన వైసీపీ సర్కార్ కష్టకాలంలో రైతులను ఆదుకుంది. తాజాగా వచ్చే నెలలో అమలు చేయబోయే పథకాలను ముందుగానే ప్రకటించిన జగన్ సర్కార్.. తమకు ఆర్థిక భరోసా ఉందనే ధీమాను లబ్ధిదారుల్లో కల్పించింది.
జూన్ నెలలో మూడు పథకాలను అమలు చేసేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమైంది. గత ఏడాది మొదటి సారి చేతివృత్తుల వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ అమలు చేసిన జగనన్న తోడు పథకాన్ని రెండో దఫా జూన్ 8వ తేదీన అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా దర్జీలు, సెలూన్ నిర్వాహకులు సహా ఇతర చేతి వృత్తుల వారికి పది వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. సొంతంగా ఆటో, ట్యాక్సి నడుపుకునే వారికి ప్రతి ఏడాది పది వేల రూపాయల చొప్పన అందించే వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని జూన్ 15వ తేదీన అమలు చేయబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి ఏడాదికి 18,750 చొప్పన నాలుగేళ్లపాటు అందించే వైఎస్సార్ చేయూత పథకం రెండో దఫాను వచ్చే నెల 22వ తేదీన అమలు చేయనున్నట్లు వైసీపీ సర్కార్ వెల్లడించింది.
ఈ పథకాలే కాకుండా.. వచ్చే నెల 31వ తేదీన పాడి రైతులకు మేలు చేసే అమూల్ ప్రాజెక్టును పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో అమలవుతోంది. జూలై 8వ తేదీన వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని నూతనంగా నిర్మించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవనాలను ప్రారంభించబోతున్నారు. ఉగాది నాటికి పట్టణ, నగరాల్లోని మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని జగన్ సర్కార్ వెల్లడించింది. ఇందు కోసం 17 వేల ఎకరాలను సేకరిస్తున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభంలోనూ వరుసగా ప్రతి నెలలోనూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న జగన్ సర్కార్.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Also Read : ఆ ఐదేళ్లూ ఓ లెక్క.. ఈ రెండేళ్లూ మరో లెక్క..!