iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యా విధానంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విద్యారంగం అభివృద్ధికి పలు చర్యలు తీసుకున్నారు. కేజీ నుంచి డిగ్రీ వరకూ విద్యను హక్కుగా పొందే అవకాశం కల్పించారు. పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా రూపొందించడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తున్నారు.
ఇంగ్లీష్ మీడియంకు ప్రాధాన్యత
రైట్ టు ఎడ్యుకేషన్‌ను రైట్ టు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్‌గా ప్రభుత్వం మార్చింది. ఈ నిర్ణయాన్ని ప్రతి విద్యార్థి తల్లి అభిప్రాయం అడిగాకే తీసుకున్నారు. అభ్యాసం కూసు విద్య అంటారు. ఇది గుర్తించిన ప్రభుత్వం అంగన్‌వాడీ స్థాయి (ప్రీ ప్రైమరీ నుంచే పిల్లలను ఇంగ్లీష్ మాధ్యమం వైపు మళ్లించేలా సంస్కరణలకు నాంది పలికింది.
ఆరు కేటగిరులుగా ప్రభుత్వ స్కూళ్లు..
ప్రభుత్వం స్కూళ్లను ఆరు కేటగిరి లుగా విభజించింది. శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2),
ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1 నుంచి రెండో తరగతి వరకు), ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు (పీపీ–1 నుంచి ఐదో తరగతి వరకు),
ప్రీ హైస్కూళ్లు (మూడో తరగతి నుంచి 7–8 తరగతుల వరకు) , హైస్కూళ్లు (3–10 తరగతులు), హైస్కూళ్లు ప్లస్ (3–12 తరగతులు),
ప్రీ ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధిస్తున్నారు. పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకొచ్చారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మూడో తరగతి నుంచి ప్రతి సబ్జెక్టుకూ ప్రత్యేక టీచర్‌ను నియమిస్తున్నారు.
జూన్‌లో అమ్మ ఒడి, విద్యా కానుక
పిల్లలను పాఠశాలలకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేల చొప్పున రెండేళ్లలో 1 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థుల తల్లుల (44.50 లక్షల మంది) ఖాతాల్లో రూ.13,023 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. దీని వల్ల 85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి పథకానికి అర్హులు. జూన్‌లో తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తారు.
ఉచితంగా నాణ్యమైన భోజనం..
గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి ఏటా రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు చేసేది. భోజనంలో నాణ్యత ఉండేది కాదు. ఇప్పుడు జగనన్న గోరుముద్ద పథకం కింద చిక్కీతో పాటు వేర్వేరు ఆహార పదార్థాలు రుచికరంగా, నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కోసం ఏటా రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్ (కుట్టు కూలితో కలిపి), బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, సాక్సులతో కలిపి జగనన్న విద్యా కానుక కింద ఉచితంగా అందిస్తున్నారు. ఈ పథకానికి రెండేళ్లలో రూ.1,437 కోట్లు ఖర్చు చేశారు. మనబడి నాడు-నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు.
57,189 ప్రభుత్వ పాఠశాలలు, 3,280 హాస్టళ్లను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చి.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించారు. తొలి విడతగా 15,715 పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడానికి రూ.3,669 కోట్లు ఖర్చు చేశారు.
పాఠశాలల్లో 24 గంటల నీటి సౌకర్యం ఉండే టాయిలెట్లను నిర్మించడమే కాకుండా.. వాటిని శుభ్రంగా నిర్వహించడానికి అమ్మ ఒడి ద్వారా ఇచ్చే రూ.15 వేలలో రూ.వెయ్యి ని తల్లులే టాయిలెట్ నిర్వహణ ఫండ్‌గా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటన్నింటి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అధిక శాతం విద్యార్థులు చేరుతున్నారు.
ఉన్నత చదువులకు అండగా..
బీటెక్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివినప్పుడే.. ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందనే లక్ష్యంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి పాలకులు ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే మూడు దశల్లో పూర్తి ఫీజును తల్లుల ఖాతాలకు రీయింబర్స్ చేస్తున్నారు. ఈ రెండేళ్లలో ఈ విద్యాదీవెన పథకానికి రూ.5,573 కోట్లు ఖర్చు చేశారు. హాస్టల్ ఖర్చుల కోసం ఐటీఐ చదివే పిల్లలకు రూ.పది వేలు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు రూ.15 వేలు, డిగ్రీ చదివే పిల్లలకు రూ.20 వేల చొప్పున విద్యా దీవెన పథకం కింద వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ రెండేళ్లలో రూ.2,270 కోట్లు ఈ విధంగా ఖర్చు చేశారు.
ల్యాప్‌టాప్‌లు ఇచ్చే యోచన..
వచ్చే సంవత్సరం అమ్మ ఒడి, వసతి దీవెన డబ్బులు వద్దు.. పిల్లలకు ఉపయోగపడేలా ల్యాప్‌టాప్‌లు ఇవ్వండి అని తల్లులు కోరితే.. బయట రూ.25వేల నుంచి రూ.27 వేల ధర పలికే ల్యాప్ టాప్‌లను తక్కువ ధరకే అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. టెండర్లు, రివర్స్ టెండర్ నిర్వహించడం వల్ల నాణ్యమైన ల్యాప్ టాప్‌లు రూ.18 వేల నుంచి రూ.18,500 వస్తాయని అధికారులు అనుకుంటున్నారు. ఇవి బాగోలేకపోతే సచివాలయంలో ఇచ్చేస్తే తిరిగి వారం రోజుల్లో కొత్త ల్యాప్ టాప్ ఇచ్చేలా నిబంధన విధించారు. దార్శనికతతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఉపాధి రంగాల్లో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా తయారవుతుందని నిపుణులు అంటున్నారు.
Also Read : AP, Children Protection – బాలల భద్రతకు భరోసా