iDreamPost
android-app
ios-app

Ap farmer’s input subsidy- నేడు రైతన్నల ఖాతాల్లో పంట నష్ట పరిహారం

  • Published Nov 16, 2021 | 4:12 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Ap farmer’s input subsidy- నేడు రైతన్నల ఖాతాల్లో పంట నష్ట పరిహారం

ప్రకృతి విపత్తుల వల్ల పంటను నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమం తప్పకుండా పరిహారం అందజేస్తోంది. గత సెప్టెంబరులో సంభవించిన గులాబ్ తుపాను కారణంగా 34,586 మంది రైతులు పంటను నష్టపోయారు. వారందరికీ రూ.22 కోట్లను పరిహారంగా మంగళవారం ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్ లో జరిగిన పంట నష్టం అదే సీజన్ ముగిసేలోగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందజేస్తోంది.

రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు..

ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంది. ఈ – క్రాప్ ఆధారంగా, పారదర్శకంగా సచివాలయాల్లో జాబితా ప్రదర్శించి మరీ నమోదైన వాస్తవ సాగుదార్లకు పంట నష్ట పరిహారం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్ర స్థాయిలో బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో రబీలో విత్తనాలు వేసుకొని, వర్షాలకు మొలక శాతం దెబ్బతిన్న శనగ రైతులకు 80 శాతం రాయితీతో మళ్లీ విత్తుకోవడానికి విత్తనాలు సరఫరా చేస్తోంది. నెల్లూరు జిల్లాలో దెబ్బతిన్న నారుమళ్లకు 80 శాతం రాయితీతో వరి విత్తనాలు అందజేస్తోంది. ఈ రబీ సీజన్ ముగిసేలోగా, ఖరీఫ్ మొదలు కాక ముందే ఈ పంట నష్టానికి కూడా పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ..

విపత్తుల సమయంలో జరిగిన నష్టానికి ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించింది. 2019-20 నుంచి 2021 సెప్టెంబరు వరకు అయిదుసార్లు రైతులకు సబ్సిడీ అందజేసింది. ఇందుకు 17.99 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన 13.96 లక్షల మంది రైతులకు 1,070.56 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసింది.

అన్నదాతల హర్షం..

గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పంట నష్ట పరిహారం అందుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురు చూసేవాళ్లమని, ఇన్ పుట్ సబ్సిడీ దాదాపు ఇచ్చేవారే కాదని రైతులు అంటున్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం ఇవ్వడమే కాక ఇన్ పుట్ సబ్సిడీ కూడా అందజేస్తున్నారని చెబుతున్నారు. వీటీని అందుకోవడానికి ఎవరి చేతులు తడిపే అవసరం లేకుండా నేరుగా తమ ఖాతాల్లో జమ చేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.